(Source: ECI/ABP News/ABP Majha)
Chintamaneni Prabhakar: ఎస్సై గారు బలగం ఉందని అన్నంపెట్టే రైతులను తోసేయకండి: చింతమనేని
Chintamaneni Prabhakar: ఏలూరు జిల్లా వూళ్ల వద్ద ధర్నా చేస్తున్న రైతులకు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ మద్దతు పలికారు.
Chintamaneni Prabhakar: ఏలూరు జిల్లా ఉంగటూరు నియోజకవర్గం వూళ్ల వద్ద జాతీయ రహదారిపై ధర్నా చేపట్టిన రైతులకు దెందలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ మద్దతు పలికారు. అటువైపుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే రైతులను చూసి కారు దిగొచ్చారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులను తోసేస్తున్న పోలీసులను అడ్డుకుని బలగం ఉంది కదా అని అన్నం పెట్టే రైతులను తోసేయవద్దని పోలీసులను వారించారు. 'ఎస్సైగారు.. బలగం ఉందని, యూనిఫాం ఉంది కదా అని కష్టపడే రైతును, అన్నంపెట్టే రైతులను తోసేయమాకండి.. నామీదంటే దొంగ కేసులు పెట్టారు.. వీళ్లమీదేం పెడతారు' అంటూ చింతమనేని ప్రభాకర్ పోలీసులకు సైటర్లు వేశారు..
60 సంచులు అవసరం అవుతుంటే 40 సంచులే ఇస్తున్నారని, సంచులు ఎంతకీ ఇవ్వడం లేదని, ఒకవేళ ఇచ్చినా మిల్లులో బస్తాకు 150 రూపాయలు తగ్గించి ఇస్తామంటున్నారని రైతులు చింతమనేనికి వారి సమస్యల గురించి వివరించారు. అధికారులు, మిల్లు ఓనర్ల తీరుతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చింతమనేని దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఎర్రటి ఎండలో ధర్నా చేస్తున్నామని అన్నదాతలు వాపోయారు. రైతుల సమస్యలు విన్న చింతమనేని వారి సమక్షంలోనే జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు.
సమస్యలతో సతమతం అవుతున్న రైతులకు పరిష్కారం చూపాలని కలెక్టర్ ను చింతమనేని కోరారు. అన్నదాతలను కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తున్నామని వీలైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ తో అన్నారు. దానికి కలెక్టర్ అంగీకరించగా.. రైతులు కలెక్టర్ వద్దకు, జేసీ వద్దకు వెళ్లి కలిసి వారి సమస్యలేమిటో వివరించాలని చింతమనేని ఆందోళన చేస్తున్న రైతులకు సూచించారు. కలెక్టర్ ను, జేసీని కలిసినా ఫలితం లేకపోతే తన వద్దకు వస్తే అందరం కలిసి ఉద్యమిద్దామని చింతమనేని భరోసా ఇచ్చారు. చింతమనేని ఇచ్చిన ధీమాతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుండి చింతమనేని ప్రభాకర్ వెళ్లిపోయారు.
ఇటీవలే చింతమనేని పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను జనవరి 2వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం నిరాహార దీక్షకు దిగిన మాజీ ఎంపీ హరిరామజోగయ్యను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. హరిరామజోగయ్యను పరామర్శించేందుకు ఏలూరు ఆసుపత్రికి వచ్చారు చింతమనేని ప్రభాకర్. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. చింతమనేని పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. చింతమనేనిని బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో చింతమనేని చొక్కా చిరిగిపోయింది. దీంతో ఆస్పత్రి వద్ద టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. హరిరామజోగయ్యను పరామర్శించేందుకు వచ్చిన కాపు సంక్షేమ సమితి నేతలను కూడా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. హరిరామజోగయ్య దీక్షతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి వద్ద జనసేన, టీడీపీ నేతలు ఆందోళనకు చేపట్టారు. హరిరామజోగయ్య ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని టీడీపీ, జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.