Modi Tour In AP: ఏపీలో మోదీ టూర్‌లో కఠిన ఆంక్షలు- వచ్చిన వారందరికీ కరోనా టెస్టులు
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఏపీలో కఠిన నియమాలు అమల్లోకి రానున్నాయి. ఎయిర్‌పోర్టులో అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు. అధికారులు.
ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటున్న మోదీ ఈనెల 4న ఆంధ్రప్రదేశ్‌లో కూడా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే గన్నవరం విమానశ్రయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకుంది. ఎస్పీజీ అధికారులు గన్నవరం విమానాశ్రయంలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయం చుట్టూ రాష్ట్ర పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. గన్నవరం డిఎస్పీ విజయపాల్, ఎయిర్పోర్ట్ ఏసీబీ వెంకటరత్నం సహా ఇతర ఉన్నత అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ బందోబస్తు కొనసాగుతోంది.
ఎయిర్పోర్టులో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో డ్యూటీ నిర్వహించే అధికార యంత్రాంగానికి ముందస్తు కరోనా పరీక్షలు చేస్తున్నారు. వివిధ విభాగాల్లో పని చేసే వారికి కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు
ఏపీలో ప్రధాని మోదీ పర్యటనతో దూకుడు పెంచాలని బిజెపి భావిస్తుంది. ఏపీపై కేంద్ర బిజెపి నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఏపీ బీజేపీ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఒకసారి నడ్డా వచ్చి వెళ్లారని అదే తరహాలో మిగతా అగ్ర నాయకులు వచ్చి వెళ్తున్నారని ఇప్పుడు మోడీ పర్యటన కూడా ఆ నేపథ్యంలో సాగుతుందని పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నారు.
బీజేపీ, ప్రధానమంత్రిపై టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు కూడా మండిపడ్డారు. కేసీఆర్ ప్రధానమంత్రిని ఆహ్వానించకపోవడంపై విష్ణువర్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో టిఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తుందన్నారు. ప్రధానమంత్రి హోదాలో మోదీ వస్తే కేసీఆర్ వెళ్లి ఆహ్వానించకపోవడం దారణమన్నారు.
భీమవరంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం సాంస్కృతిక శాఖ నిర్వహిస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. దీనికి రాజకీయాలకు అతీతంగా పార్టీలను ఆహ్వానించినట్టు తెలిపారు. 4వ తేదీన ప్రధాన మోదీ భీమవరంలో పర్యటస్తారని అందులో భాగంగానే ఆయన చేతుల మీదుగా అల్లూరి విగ్రహావిష్కరణ ఉంటుందని తెలిపారు. ఏపీ ప్రతిపక్ష నేతగా చంద్రబాబును ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని అన్నారు. టిడిపి అధినేతగా చంద్రబాబు పిలవడం లేదని తెలిపారు. జగన్ ఫ్రస్టేషన్లో బూతులు మాట్లాడుతున్నారని.. త్వరలోనే ప్రజలు జగన్ కుర్చీ పీకేయడం ఖాయమని జోస్యం చెప్పారు విష్ణు. బూతులు మాట్లాడడానికి వైసిపి ఒక మంత్రి నియమించిందని ఎద్దేవా చేశారు. వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను బిజెపి ఎండగడుతుంది అని.. పవన్, బిజెపి వేరుగా చూడటం లేదని అన్నారు.