బ్రిటిషన్ దొరను కీర్తిస్తూ శ్లోకం- నేటికీ నిత్యం స్మరిస్తున్న గోదావరి జనం- ఆయనంటే ఎందుకంత ప్రేమ?
ఒకప్పుడు గోదావరి కరవు రక్కసి కోరలు చాచేది అంటే నమ్మగలరా?. లక్షల మంది ఆకలితో చచ్చిపోయే వారంటే ఆశ్చర్యంగా ఉండదా.? కానీ ఇది నిజం. అలాంటి ప్రాంతాన్ని సమూలంగా మార్చేశాడో మనహనీయుడు.
![బ్రిటిషన్ దొరను కీర్తిస్తూ శ్లోకం- నేటికీ నిత్యం స్మరిస్తున్న గోదావరి జనం- ఆయనంటే ఎందుకంత ప్రేమ? sir arthur cotton who built barrage over godavari in andhra pradesh and made those districts prosperous బ్రిటిషన్ దొరను కీర్తిస్తూ శ్లోకం- నేటికీ నిత్యం స్మరిస్తున్న గోదావరి జనం- ఆయనంటే ఎందుకంత ప్రేమ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/14/5b32f9a48668563eb1c7437e21ab009f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
"నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః
స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం.. ":
(మాకు గోదావరి నదీ స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరధుడు, ఆంగ్ల దేశీయుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము. అని ఈ శ్లోకానికి అర్ధం.)
ఈరోజుకీ ఉదయాన్నే రాజమండ్రి కోటగుమ్మం వద్దగల గోదావరి రేవు వద్దకు వెళితే కాస్త పాత తరానికి చెందిన పండితులు గోదావరి స్నానం చేస్తూ కాటను దొరని ఇలా స్మరించుకుంటారు. ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించడం ద్వారా ఇక్కడి ప్రజల మనస్సులో అంతలా చెరగని ముద్ర వేశారు సర్ ఆర్ధర్ కాటన్. సాధారణంగా దొర అని పిలవడం ఒకవిధమైన బానిసత్వానికి ప్రతీక అయితే కాటన్ విషయంలో మాత్రం ఆయన పట్ల గోదావరి ప్రాంత ప్రజలకు గల అభిమానాన్ని, కృతజ్ఞతను తెలుపుతాయి.
పశ్చిమ గోదావరి ఏలూరు, తూర్పుగోదావరి కాకినాడ, కోనసీమజిల్లాల్లో కాటన్ దొర విగ్రహం లేని మండలం కనిపించదు. ఇవన్నీ రాజకీయ నాయకులు పెట్టుకున్న విగ్రహాలు కావు . కాటన్ దొర మీద ప్రేమతో ప్రజలు పెట్టుకున్నవి. తరాల వెంబడి ఒక బ్రిటీష్ అధికారిపై ఇంతలా గోదావరి ప్రాంత ప్రజలు అభిమానం చూపడానికి కారణం చాలా పెద్దదే ఉంది.
నిత్యం పచ్చ తోరణంలా ఉండే గోదావరి జిల్లాలు ఒకప్పుడు కరవుకు నెలవు
గోదావరి నదిపై ధవళేశ్వరం బ్యారేజ్ కట్టడానికి ముందు గోదావరి డెల్టాలోని ప్రజలు వర్షాకాలంలో విపరీతమైన గోదావరి వరదల వలన అతివృష్టి, మిగిలిన కాలంలో నీరు నిలువ లేక అనావృష్టి కి లోనయ్యేవారు. ఈ ప్రాంతంలో దారిద్య్రం తాండవించేది. 1833లో అనావృష్టి వలన కరవు వచ్చి, వేలసంఖ్యలో ఆకలి చావులు సంభవించాయి. దీనికి నందన కరువు అనిపేరు. దాదాపు రెండు లక్షల మంది కరవు బారిన పడ్డారని అప్పటి గణాంకాలు చెబుతున్నాయి. అలాగే 1839లో తీవ్రమైన తుపానులు, ఉప్పెన కారణంగా పొలాలు, గ్రామాలు ముంపునకు గురై, వేలాది జనం కాందిశీకులుగా పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళవలసివచ్చిందని చెబుతారు. ఆ పరిస్థితులను గమనించిన బ్రిటీష్ ప్రభుత్వం ఇక్కడ ఆనకట్ట కట్టడానికి వీలవుతుందో లేదో చూడడానికి చీఫ్ ఇంజనీర్ గా ఆర్ధర్ కాటన్ ను పంపింది .
గుర్రమెక్కి తిరుగుతూ అరటిపళ్ళతో ఆకలి తీర్చుకుంటూ
గోదావరిపై ఆనకట్ట కట్టేందుకు అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ గుర్రంపై స్వారీ చేస్తూ, గోదావరి నది ప్రాంతాన్ని కూలంకషంగా పరిశీలించడం మొదలుపెట్టారు కాటన్ దొర. మొదట పాపికొండల ప్రాంతాన్ని పరిశీలించారు. తర్వాత పోలవరం దగ్గర ఉన్న మహానందికొండ- పొదలకొండ తీరప్రాంతాన్ని పరిశీలించారు. అవన్నీ దట్టమైన అటవీ ప్రాంతాలు. సర్వే చేసే సమయంలో ఆహారం దొరక్క పొతే కేవలం అరటిపండ్లు తింటూనే సర్వే కొనసాగించారు కాటన్ దొర. చివరకు ధవళేశ్వరం, విజ్జేశ్వరము మధ్య నదివెడల్పుగా ఉండటం, లంకలు, ఇసుకతిప్పలు ఉండటం వలన, ఆనకట్ట నిర్మాణ సమయంలో నది నీటిని పక్కకు మళ్లించుటకు అనుకూలంగా ఉంటుందని భావించి, కాటన్ తన నివేదికను పైవారికి పంపారు. వారు ప్రాజెక్టు రిపోర్టును పరిశీలించి, డిసెంబరు 23, 1846న తమ ఆమోదం తెలిపారు. చీఫ్ ఇంజనీర్ గా కాటన్ నే నియమిస్తూ ఆయన ఆధ్యర్యములో 1847లో ఆనకట్టనిర్మాణం మొదలెట్టారు.
నిర్మాణం మొదలైంది ఇలా
గోదావరిపై ఆనకట్ట నిర్మించదలచిన చోట నది వెడల్పు దాదాపు 6 కి.మీ. అందులో చాలా లంకలున్నాయి. సహజసిద్దంగా గోదావరి ఈ లంకల వద్ద విడిపోవడంతో ఆ నదీపాయలను సప్త గోదావరిగా ప్రాచీన కలం నుంచీ పిలుస్తూ వస్తున్నారు. ఆ ప్రాంతంలో నీటి మళ్ళింపునకు మొదట ఇసుకగట్లను కట్టారు. 1847 నాటికి ఆనకట్ట నిర్మాణం కోసం పదివేలమంది కూలీలను, ఐదువందల మంది వడ్రంగులను, ఐదువందల మంది కమ్మరులను నియమించారు. కూలీలు పనిచేసే సమయంలో వారి పిల్లలకు పాఠాలు కాటన్ భార్య ఎలిజెబెత్ చెప్పేవారు. ఆనకట్టకు అవసరమైన రాయిని రైలు బోగీల ద్వారా నది ఒడ్డుకు చేర్చేవారు. అలా చేర్చిన రాళ్లను పడవల ద్వారా నదిలోని నిర్మాణప్రాంతానికి రవాణా చేసేవారు. ఇందుకు 25 టన్నుల భారం మోయగల 18 నావలను వాడారు. రోజుకు దాదాపు 150 టన్నుల రాయిని నదీగర్భములో నిర్మాణ స్థలానికి తీసుకెళ్లేవారు, ఈ పడవల ద్వారా ఇదే సమయంలో తగినంత ఇటుక తయారుకాగానే, ఆనకట్ట పునాదులు, నూతులు తవ్వే పనులు చురుకుగా ప్రారంభించి, 1847 జూలైలో నదిలో నీరుచేరువరకు కొనసాగించారు.
నదిలో నీరు చేరగానే పడవలలో రాళ్లను నదిలోని లంకలకు చేర్చి, గట్లను గట్టిపరచే పనులు మొదలుపెట్టారు. లంకలోని అన్నిగట్లను ఏకకాలంలోనే కట్టడం మొదలుపెట్టారు. తగినంత ఆర్థికసహాయం అందుబాటులోకి రాగానే, 1849 ఫిబ్రవరిలో విజ్జేశ్వరం వైపు ఆనకట్ట పనులు ప్రారంభించారు. 1852 లో ఆనకట్టనిర్మాణం పూర్తయ్యింది. కాటన్ దొర ధవళేశ్వరం వద్దనే తన నివాసం, కార్యాలయం ఏర్పాటు చేసుకుని గుర్రంపైనే ఆ నిర్మాణ పనులను పర్యవేక్షించేవారు ఆయనకు ఈ పనిలో వీరన్న అనే తెలుగు వ్యక్తి బాగా సహకరించారు. ఆయన పేరుమీద కూడా కాటన్ బ్యారేజ్‌పై ఒకచోట శిలాఫలకం ఉండేది.
ఈ ఆనకట్ట కట్టి చాలా కాలం కావడంతో స్వాతంత్య్రం వచ్చాక సరిగ్గా కాటన్ ఎప్పుడో కట్టిన ఆనకట్ట స్థానంలోనే మరో బ్యారేజ్ కట్టారు. ఇది 1970 నుంచి 1982 మధ్య నిర్మాణం పూర్తీ చేసుకుంది. కాటన్ బ్యారేజ్ కింద తూర్పు డెల్టా కాలువ కింద 2.76 లక్షల ఎకరాలు, మధ్యడెల్టాకాలువ కింద 2.04 లక్షల ఎకరాలు, పశ్చిమ డెల్టాకాలువ కింద 5.20 లక్షల ఎకరాలు సాగులో ఉంది. దీనిదెబ్బతో గోదావరి డెల్టాలో కరవు మాయమై సుభిక్షంగా మారింది.
ఆకట్టుకునే కాటన్ మ్యూజియం
ధవళేశ్వరం బ్యారేజ్ పక్కనే కాటన్ మ్యూజియం ఉంది. ఇది ఆ బ్యారేజ్ కట్టేటప్పుడు కాటన్ దొర తన కార్యాలయంగా ఉపయోగించారు. ఇప్పటికీ ఆనాటి బ్యారేజ్ కట్టడానికి ఉపయోగించిన పరికరాలు, యంత్రాలు, ప్లానులు పదిలంగా ఉన్నాయి. 1803లో పుట్టిన కాటన్ దొర తన జీవితంలో అధికభాగం భారత్‌లోనే గడిపారు. గోదావరితోపాటు కృష్ణా నదిపై బ్యారేజ్ కట్టడానికి నివేదికను కూడా ఆయనే ఇచ్చారు. 1860లో రిటైర్ అయి ఇంగ్లాండ్ వెళ్లిన ఆయన చేసిన సేవలకు సర్ బిరుదు ప్రధానం చేశారు. అయినప్పటికీ భారత్‌ను విడిచి ఉండలేక మళ్ళీ 1863లో భారత్ వచ్చి సోన్ లోయలోని ప్రాజెక్టులకు సలహాలిచ్చారు. ఆరోగ్యం క్షీణించడంతో ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన ఆయన 96 ఏళ్ల వయస్సులో 1899లో కన్నుమూశారు .
కాటన్ చేసిన సేవలకు గోదావరి డెల్టా వాసులు ఇప్పటికీ ఆయన్ని తమ మనసులో సజీవంగా దాచుకున్నారు. తన తాతను తెలుగువారు ఇంతిలా అభిమానిస్తారని తెలుసుకున్న ఆయన మనవడు ఆ మధ్య గోదావరి జిల్లాలకు వచ్చినప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు ఆయనకు కూడా బ్రహ్మరథం పట్టడాన్ని బ్రిటన్ మీడియా కూడా చాలా ఆశ్చర్య పోతూ ప్రచురించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)