రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ తాత్కాలికంగా మూసివేత- స్థానికుల అసహనం
గోదావరి నదిపై రాజమండ్రి కొవ్వూరు మధ్య ఉన్న రోడ్ కం రైల్వే బ్రిడ్జి వారం రోజల పాటు మూసివేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. కొన్ని మరమ్మతులను ఆర్ అండ్‌బి, రైల్వేశాఖ చేపట్టనున్నాయని వివరించారు.
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి- కొవ్వూరు మధ్య ఉన్న రోడ్ కం రైల్వే బ్రిడ్జ్‌ను తాత్కాలింగా మూసివేశారు. మరమ్మతులు కారణంగా రహదారిపై రాకపోకలు నిలిపేశారు అధికారులు. దీనిపై అమరావతి రైతులు సీరియస్ అవుతున్నారు. పాదయాత్రను సజావుగా సాగనియ్యకుండా ప్రభుత్వం మరో కుట్ర చేస్తోందని మండిపడుతున్నారు.
గోదావరి నదిపై రాజమండ్రి కొవ్వూరు మధ్య ఉన్న రోడ్ కం రైల్వే బ్రిడ్జి వారం రోజల పాటు మూసివేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. కొన్ని మరమ్మతులను ఆర్ అండ్‌బి, రైల్వేశాఖ చేపట్టనున్నాయని వివరించారు. దెబ్బతిన్న రోడ్డు మార్గం, రెయిలింగ్, ఫుట్‌పాత్ పూర్తిగా మరమ్మతు చేయాల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.
కీలకమైన బ్రిడ్జి మూసివేయడం వల్ల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు అధికారులు. వాహనాలను నాల్గో బ్రిడ్జి మీదుగా మళ్లించనున్నట్టు పేర్కొన్నారు.
ఇప్పుడు అక్కడ నుంచి ఎలాంటి వాహనాలను అధికారులు వెళ్లనీయడం లేదు. కనీసం అత్యవసర సర్వీసు 108ను కూడా అనుమతించడం లేదు.
పనులు ప్రారంభం కాకుండానే అధికారులు హడావుడి చేయడంపై స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా మూసివేస్తే ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు.
మరికొందరు వేరే వాదన వినిపిస్తున్నారు. అమరావతి రైతుల యాత్ర శనివారం ఈ బ్రిడ్జి మీదుగానే వెళ్లాల్సి ఉందని అందుకే ముందస్తుగా మూసివేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాదయాత్రను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చర్యలు తీసుకున్నారని లోకల్ టాక్. రేపు ఉదయం నాటికి కొవ్వూరు వంతెన వద్దకు చేరుకోనున్న అమరావతి రైతుల పాదయాత్ర.
బ్రిడ్జి మూసివేయడంపై అమరావతి రైతులు, టీడీపీ లీడర్లు సీరియస్ అవుతున్నారు. ఇలాంటి చర్యలతో పాదయాత్రకు ఆటంకం కలిగించలేరని అంటున్నారు. తమ సంకల్పాన్ని తగ్గించలేరని చెబుతున్నారు.