Raghurama Cancelled Bhimavaram Tour: ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో ఎంపీ రఘురామ పేరు లేదు: ఏలూరు డీఐజీ క్లారిటీ
Raghurama Cancelled Bhimavaram Tour: భీమవరం వచ్చేందుకు బయలుదేరిన ఎంపీ రఘురామ మధ్యలోనే ట్రైన్ దిగి ఇంటికి వెళ్లిపోయారు. ప్రధాని మోదీ పర్యటనకు ఎంపీ రఘురామ హాజరవుతారని ఏ జాబితాలో లేదని పోలీసులు తెలిపారు.
Raghurama Cancelled Bhimavaram Tour: వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చివరి నిమిషంలో భీమవరం పర్యటనను విరమించుకోవడం తెలిసిందే. భీమవరం వచ్చేందుకు బయలుదేరిన ఎంపీ రఘురామ మధ్యలోనే ట్రైన్ దిగి ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లింగంపల్లిలో రైలు ఎక్కిన ఎంపీ రఘురామకృష్ణరాజు బృందం బేగంపేట రైల్వే స్టేషన్ లో రైలు దిగిపోయారు. ప్రధాని మోదీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కార్యక్రమానికి నరసాపురం ఎంపీ రఘురామ హాజరవుతానని ఇటీవల ప్రకటించారు. చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకుని ఏపీ ప్రభుత్వానికి ట్విస్ట్ ఇచ్చారు.
రఘురామకృష్ణరాజు ఏ జాబితాలోనూ లేరు..
ఏపీలో ప్రధాని మోదీ పర్యటనలో తాను పాల్గొంటున్నట్లు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల ప్రకటించారు. తనను ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. అయితే ప్రధాన మంత్రి ఆఫీసు నుంచి వచ్చిన జాబితాలో గానీ, ఆ వేదికపై ఉండే వారి జాబితాలోగానీ, లేదా ప్రధాని మోదీని హెలిప్యాడ్ వద్ద ఆహ్వానించే వారి జాబితాలో కూడా ఎంపీ రఘురామ పేరు లేదని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాల్గొననున్న ఈవెంట్‌కు ఎంపీ రఘురామ ఎలా హాజరు అవుతున్నారో తమకు తెలియదన్నారు. నరసాపురం ఎంపీ విషయంలో తాము చట్టాన్ని అనుసరిస్తామని, అదే విధంగా రఘురామ ఫోన్ నెంబర్‌ను సైతం రాష్ట్ర పోలీస్ శాఖ బ్లాక్ లిస్టులో పెట్టలేదని వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటనకు హాజరయ్యే వారిలో వాయుమార్గంలో రావాలనుకున్న వారు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని సూచించారు.
మా వాళ్లను అక్రమంగా నిర్బంధించారు: రఘురామ
తాను నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో భీమవరం బయలుదేరానని ఎంపీ రఘురామ ఆదివారం రాత్రి తెలిపారు. అయితే తాను రైల్వే స్టేషన్ కు వచ్చే లోపు తన వాళ్లను ఇప్పటివరకూ 50 మందిని అరెస్టుచేసినట్లు తెలుస్తోందని అనుమానాలు వ్యక్తం చేశారు. వారిలో కొంత మందిని కొడుతూ పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని చెప్పారు. తన వాళ్ల కోసం వారి తల్లిదండ్రుల నుంచి ఫోన్లు వస్తున్నాయని, అభిమానులు, మద్దతుదారుల క్షేమం కోసమే తాను భీమవరం పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. తన ప్రయాణం రద్దు చేసుకుంటేనే, అభిమానులను వదిలేస్తామని సమాచారం అందడంతో చివరి నిమిషంలో భీమవరం వెళ్లకుండా మార్గం మధ్యలోనే రైలు దిగానని వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరం పర్యటనలో పాల్గొనేందుకు బయలుదేరిన తాను ప్రయాణం మధ్యలో ఆగిపోవడానికి గల కారణాలు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన దారుణమైన కుట్రలపై నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ ఫేస్‌బుక్ లో ఓ వీడియో రూపంలో తెలిపారు.
Also Read: MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోనే ట్రైన్ దిగిపోయిన ఎంపీ