Purandeswari: రాజమండ్రి ఎంపీగా బరిలోకి పురందేశ్వరి- సోము వీర్రాజుతో పాటు కూటమి నేతలు సహకరిస్తారా ?
Andhra Pradesh Politics: రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. ఇదే టికెట్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఆశించారు.
Rajamundry Parliament: రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Rajahmundry)పోటీ చేస్తున్నారు. ఇదే టికెట్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) కూడా ఆశించారు. అయితే అధిష్టానం మాత్రం పురందేశ్వరి వైపే మొగ్గు చూపింది. తొలినుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సోము వీర్రాజును కాదని పురందేశ్వరికి టికెట్ ఏలా ఇస్తారని... సొంత పార్టీ నేతల నుంచే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
పురందేశ్వరి కోసం తమను బలి చేస్తారా ? అంటూ మరోవైపు టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బిజెపికి షాక్ తగిలింది. 19 అసెంబ్లీ స్థానాల్లో పొత్తులో బిజెపికి ఒక్క సీటు కూడా దక్కలేదు. టిడిపి 14 స్థానాల్లో పోటీ చేస్తుంటే... జనసేన ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తులో బిజెపికి రాజమండ్రి పార్లమెంట్ టికెట్ మాత్రమే దక్కింది. కాకినాడ సీటు జనసేనకు కేటాయిస్తే... అమలాపురం ఎంపీ టిక్కెట్ టిడిపి తీసుకుంది.
టీడీపీ తరపున టికెట్ ఆశించిన బొడ్డు వెంకటరమణ చౌదరి
తెలుగుదేశం పార్టీ తరపున రాజమండ్రి పార్లమెంట్ సీటును బొడ్డు వెంకట రమణ చౌదరి ఆశించారు. పొత్తులతో భాగంగా బీజేపీకి వెళ్లిపోవడాన్ని ఆయన ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేన కోసం ఇప్పటికే రాజానగరం అసెంబ్లీ సీటును బొడ్డు త్యాగం చేశారు. ఎంపీ టికెట్ అయినా వస్తుందనుకుంటే... అదీ దక్కలేదు. పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచారని సన్నిహితుల వద్ద బొడ్డు వెంకట రమణ వాపోతున్నారు.
పురందేరేశ్వరికి సొంత పార్టీలోనే అసమ్మతి
పురందేరేశ్వరికి రాజమండ్రి టికెట్ కన్ఫామ్ కావడంతో సొంత పార్టీలోనే అసమ్మతి తప్పేలా లేదు. మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు వర్గం... పురందేశ్వరికి ఎంత వరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. టిడిపిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బిజెపికి టిక్కెట్ కేటాయింపుపై పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు వెంకటరమణ చౌదరి, గన్ని కృష్ణ వంటి నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఐదు స్థానాల్లో టిడిపి అభ్యర్థులు, రెండు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ రెండు పార్టీల అభ్యర్థులను కలుపుకుని బిజెపి ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. సోము వీర్రాజుతోపాటు టీడీపీ తరపున టికెట్ ఆశించిన నేతలు పురందేశ్వరికి ఎలా సహకరిస్తారా ? లేదంటే వ్యతిరేకంగా పని చేస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో భారీగా కమ్మ ఓటర్లు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు భారీగా ఉన్నారు. ముఖ్యమంత్రి రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో మెజార్టీ ఓటర్లు వారే. అందుకే వ్యూహాత్మకంగా దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు బీజేపీ గెలిచింది. 1998లో గిరిజాల వెంకటస్వామి నాయుడు, 1999 పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్బీపీబీకే సత్యనారాయణ రావు విజయం సాధించారు. దీనికితోడు తెలుగుదేశం పార్టీకి రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్,కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి నియోజకవర్గాల్లో మంచిపట్టుంది. కూటమి పార్టీలకు ఓటింగ్ శాతం ఎక్కువ ఉండటంతో పురందేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థి భరత్ రామ్ విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాసులును పురందేశ్వరి ఢీ కొట్టబోతున్నారు.