Pulasa Fish Record Price: రికార్డ్ ధర పలికిన పులస చేప, ఈ సీజన్లో ఇదే అత్యధికం
Pulasa Fish Price | గోదావరిలో మరో పులస చేప దొరికింది. రెండు కేజీలు కూడా లేని పులస చేప యానాం బీచ్ లో రికార్డు ధర పలికింది.

Pulasa Fish Cost at Yanam Fish Market | కాకినాడ: వర్షాకాలం వచ్చిందంటే చాలు పులసలు ఎప్పుడు వస్తాయా వేలంలో ఎంతకు దక్కించుకుంటామా అని ఎదురుచూస్తుంటారు. ఈ సీజన్ ఇదివరకే రెండు పులసలు మత్స్యకారుల వలకు పడ్డాయి. ఈ సీజన్లో ఖరీదైన పులస చేప శనివారం జాలర్ల చేతికి చిక్కడంతో వారి పంట పండింది. యానాం గోదావరిలో మత్స్యకారులకు చిక్కిన పులస వేలంపాటలో 22,000 రూపాయలు పలికింది. గోదావరికి ఎదురీదుతూ వచ్చే పులసను పుస్తెలమ్మి అయినా తినాల్సిందే అంటారు.
ఈ సీజన్లో పులస చేప (Pulasa Fish) రికార్డు ధర
ఒక కేజీ 800 గ్రాముల బరువు ఉన్న ఆ పులస చేపను యానాం బీచ్ లో జరిగిన వేలంపాటలో స్థానిక మహిళ పొన్నమండ రత్నం రికార్డు ధరకు దక్కించుకున్నారు. దాంతో ఈ సీజన్లో ఇప్పటివరకూ ఇద ఖరీదైన పులస చేపగా నిలిచింది. మల్లాడి ప్రసాద్ అనే మత్స్యకారుడికి ఆ పులస చేప దొరికింది. కొందరు ఆ పులసను వేలంలో దక్కించుకుని వండుకుని తింటారు. మరికొందరు పులస చేపను మరొకొంత లాభానికి ఇతరులకు విక్రయిస్తుంటారు. గత ఏడాది ఇదే మత్స్యకారుడి వలకు చిక్కిన పులస రికార్డు స్థాయిలో రూ.23 వేల ధర పలికింది. ఈ సీజన్లో తాజాగా రూ.22 వేలు పలికిన పులస ఇప్పటివరకూ ఖరీదైనదిగా చెప్పవచ్చు.

తొలి రెండు పులసలకు తక్కువ ధర
ఈ ఏడాది గోదావరిలో పులస చేప దాదాపు రెండు వారాల కిందట మత్స్యకారుల వలకు చిక్కింది. అది ఈ సీజన్లో తొలి పులస చేప. కాగా, యానాం బీచ్ లో వేలం పాటలో కేవలం రూ.4 వేలు ధర పలికింది. రెండు రోజుల కిందట మరో మత్స్యకారుడి వలకు చిక్కిన పులస చేప కాస్త పరవాలేదనిపించింది. రెండో పులస చేప రూ.12 వేలు ధర పలికింది. ఈ ఏడాది పులస చేపలకు డిమాండ్ తగ్గిందా ఏంటి అని స్థానికంగా చర్చ జరుగుతున్న క్రమంలో తాజాగా రికార్డు ధర వచ్చింది. స్థానిక మహిళ రూ.22 వేలకు పులసను దక్కించుకుంది.
వేలం పాటకు ముందు పులస చెకింగ్
పులస చేపను యానాంలోని రాజీవ్ బీచ్ లో వేలం వేస్తుంటారు. వేలంలో పాల్గొనేవారు ఓసారి ముందుగా పులస చేపను చూసుకుంటారు. వేలంలో పాల్గొనేవారు ఒక్కొక్కరుగా వెళ్లి పులస చేపను పరిశీలిస్తారు. అంతా ఓకే అనుకుంటే వేలంలో పాల్గొని తమకు తోచిన ధర పాడి పులస చేపను పట్టుకెళ్తారని వేలం పాట నిర్వాహకులు, స్థానికులు తెలిపారు. జులై నుంచి అక్టోబర్ వరకు పులసలు సముద్రం నుంచి గోదావరి నదిలోకి ఎదురీదుతూ వస్తాయి. ఇక్కడ గుడ్లు పెట్టి వెళ్లే క్రమంలో మత్స్యకారుల వలకు చిక్కుతుంటాయి. దాంతో మత్స్యకారులకు పులస రికార్డు రేటు పలికితే మంచిగా గిట్టుబాటు అయినట్లే.
కొందరు వేరే చేపలను తెచ్చి పులస చేప అని విక్రయించాలని చూస్తుంటారు. కానీ గోదావరి ప్రజలు, స్థానికులు పులస చేప కాదని ఈజీగా గుర్తు పడతారు. విక్రయించే వారు చాలా జాగ్రత్త పడతారు.






















