Pulasa: కేజీన్నర చేప ధర రూ.24 వేలు - అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?
Konaseema News: గోదావరిలో దొరికే పులస చేపంటే ఆ క్రేజే వేరు. తాజాగా, కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ఓ కేజీన్నర పులస చేప రూ.24 వేల భారీ ధర పలికింది. దీంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Pulasa Fish Cost 24 Thousand Rupees In Konaseema: కేజీన్నర చేప ఖరీదు అచ్చంగా రూ.24 వేలు. మీరు విన్నది నిజమే. ఒక్క చేప ఏంటీ.? రూ.24 వేలు ఏంటీ.? అని ఆశ్చర్యపోతున్నారా.? అది గోదారి పులస చేప మరి. గోదారమ్మకు వరద వచ్చిందంటే పులస చేపల సందడి మొదలవుతుంది. మాంసాహారం అందులోనూ పులస చేపలంటే ఇష్టపడని వారుండరు. ఆ చేపల కూర ఎప్పుడు రుచి చూద్దామా.! అంటూ ఎదురు చూస్తుంటారు. అందుకే గోదావరి జిల్లాల్లో 'పుస్తెలు అమ్మయినా సరే పులస కూర తినాలనేది' ఓ నానుడి. పులస చేపను రుచి చూడాలని మాంసాహార ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. మత్స్యకారుల వద్ద భారీ ధరకు కొనుగోలు చేస్తుంటారు.
వలకు చిక్కిన పులస
మత్స్యకారులు ఏర్పాటు చేసే ప్రత్యేక వలల్లో పులస చేపలు (Pulasa Fish) చిక్కుకుంటాయి. ప్రస్తుతం భారీ వర్షాలతో గోదావరికి ఎర్ర నీరు వస్తుండడంతో ఓ గంగపుత్రుడి పంట పండింది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని (Konaseema District) వశిష్ట గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంకకు చెందిన మత్స్యకారుడి వలలో సుమారు కేజీన్నర బరువున్న పులస చేప చిక్కింది. మాజీ సర్పంచ్ బర్రే శ్రీను రూ.24 వేలు పెట్టి దీన్ని కొనుగోలు చేశారు. కాగా, రుచిలో మేటిగా ఉండే పులసంటే ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు. ఇతర ప్రాంతాల వారికి అమితమైన ఇష్టం. అందుకే ప్రతీ సీజన్‌లోనూ పులస చేపల కోసం మత్స్యకారులు తీవ్రంగా గాలిస్తుంటారు. ఇవి చిక్కితే వారి పంట పండినట్లే.
Also Read: APCNF: ఏపీ సేద్యానికి అరుదైన గుర్తింపు - అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక 'గుల్బెంకియన్ అవార్డు'