Pawan Kalyan About Politics: వైసీపీ లాంటి పార్టీల వల్లే రాజకీయాలపై వ్యతిరేకత, అది సమాజానికి చేటు: పవన్ కళ్యాణ్
Pawan Kalyan About Politics: డాక్టర్లు, లాయర్లు, పారిశ్రామికవేత్తలు, మేధావులు, ఔత్సాహికులాంటివారు రాజకీయాలు, సంబంధిత ప్రక్రియపై అనాసక్తి చూపుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.

Pawan Kalyan About Politics: 'వైసీపీ లాంటి పార్టీలు చేస్తున్న రాజకీయాలు చూసి ఓ వర్గం ప్రజల్లో రాజకీయాల మీద అనాసక్తి పెరిగిపోయింది. డాక్టర్లు, లాయర్లు, పారిశ్రామికవేత్తలు, మేధావులు, ఔత్సాహికులాంటివారు రాజకీయాలు, సంబంధిత ప్రక్రియపై అనాసక్తి చూపుతున్నారు. ఇలాంటి కుళ్లు రాజకీయాలు మాకెందుకు అన్న భావన వారిలో బలపడిపోయిందని’ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. పెన్షనర్ల స్వర్గంగా పేరున్న కాకినాడ లాంటి నగరాల్లో ప్రజలు బయటికి వచ్చి ఓటు వేసేందుకు కూడా ఇష్టపడడం లేదని. ఓ విధమైన తటస్థస్థితికి చేరుకుని ఓటు వేయాలంటే అయిష్టత పెరిగిపోయింది. రాజకీయం మనకు సంబంధం లేని వ్యవస్థ అన్న ఆలోచనలు సమాజానికి చేటు' అని స్పష్టం చేశారు.
వారాహి విజయ యాత్రలో భాగంగా సోమవారం కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖులు, మేధావులు, డాక్టర్లు, లాయర్లు, విద్యావేత్తలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. వారి వారి రంగాల్లో ఎదురౌతున్న సమస్యలు, అనుభవాలపై చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "పాలకులు బాధ్యతగా వ్యవహరించనప్పుడు యంత్రాంగం సక్రమంగా పని చేయదు. పరిశ్రమలకు అనుమతులు రావు. ఈ పరిస్థితుల మధ్య పారిశ్రామిక వేత్తలు వెనక్కి వెళ్లిపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలను పూర్తిగా చంపేసింది. ఎక్కడ చూసినా ఏదో రకమైన దోపిడి ఉందన్నారు.
జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన తేవాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. వ్యవస్థలు క్లీన్ గా ఉండబట్టే సత్య నాదెళ్ల లాంటి వారు ప్రపంచం చెప్పుకునే స్థాయికి ఎదిగారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల అతి పెద్ద ఆదాయ వనరుగా ఉన్న ఆక్వా పరిశ్రమ దెబ్బతింది. ఒక విధానం లేని అర్బనైజేషన్ వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ స్థాయి సౌకర్యాలు లేకపోయినా ఆ స్థాయిలో ప్రభుత్వం నుంచి బాదుడు తప్పడం లేదన్న విషయాలు మేధావులు, ప్రముఖుల నుంచి వచ్చిన సమాచారం ఆదారంగా తెలుస్తున్నాయి. సమాజంలో పేరుకుపోయిన రుగ్మతలన్నింటికీ చీడపట్టిన రాజకీయ వ్యవస్థే కారణం. వీటన్నింటి పరిష్కారానికి జనసేన పార్టీ ఓ చారిత్రక పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు వేస్తుంది. ఆ దిశగా సమాజాన్ని జాగృతం చేయాలని అన్నారు.
రాజకీయాలు మాకొద్దనే ఆలోచన సమాజానికి చేటు
— JanaSena Party (@JanaSenaParty) June 19, 2023
• కుళ్లు రాజకీయాలు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు
• ఓటు వేసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు
• వైసీపీ లాంటి పార్టీల వల్లే రాజకీయాలపై వ్యతిరేకత
• బాధ్యతలేని పాలకుల వల్ల వ్యవస్థ గాడి తప్పుతోంది#VarahiVijayaYatra pic.twitter.com/rxS7RjqGQr
ఈ భేటీలో కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖులు, మేధావులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. కోకనాడ టౌన్ ప్రయాణీకుల సంఘం అధ్యక్షులు వై.డి.రామారావు మాట్లాడుతూ.. అన్నవరం నుంచి గ్రీన్ ఫీల్డ్ పోర్టు, కాకినాడ పోర్టు, కోటిపల్లి, నరసాపురం మీదుగా రేపల్లె వరకూ రైల్వే లైన్ అవసరాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. పవన్ స్పందిస్తూ "కోస్తా రైలు మార్గం అనే అంశంపై పార్టీ తరఫున నాలుగు జిల్లాల నాయకులతో ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించి తమ వంతుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. మన ఎంపీలు పార్లమెంటుకు వెళ్లి ప్రజల అవసరాలపై ఒక్క మాట కూడా మాట్లాడరు. కేవలం టిఫిన్లు తినేసి వచ్చేస్తారు. కేంద్రంలో ఉన్న పెద్దల వద్ద నా పదవుల కోసం ఏ రోజు మాట్లాడింది లేదు. రాష్ట్రంలో కరువైన శాంతి భద్రతల అంశం ప్రధాన అంశంగా ఉంది. కోస్తా రైలు మార్గం అంశాన్ని కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్తాను. మీ అందరి కలల సాకారానికి కృషి చేస్తాన"ని హామీ ఇచ్చారు.





















