(Source: ECI/ABP News/ABP Majha)
Pawan Kalyan: ఆ గొడవలు రేపింది వైసీపీనే, ఒక్క అవకాశానికి మొత్తం నాశనం చేశారు - పవన్ కల్యాణ్
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
ముఖ్యమంత్రి జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని నాశనం చేశారని, రెండున్నర లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ రాకుండా చేశారని అన్నారు. ఆఖరికి మద్దతు ధర ఇవ్వకుండా కూడా రాష్ట్ర రైతాంగానికి తీరని ద్రోహం చేశారని అన్నారు. ఎస్సీలకు అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాన్ని తీసేశారని.. దోపిడీ చేసే వారికి ఒక్క అవకాశం ఇస్తే ఏం చేశారో చూశారు కదా అని అన్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, బాలక్రిష్ణ, ప్రభాస్, రవితేజ, నితిన్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సహా చిత్ర పరిశ్రమలోని అందరు హీరోల అభిమానులకు నమస్కారాలు అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడారు. చిత్ర పరిశ్రమలోని ప్రతి హీరో తాను కష్టపడి, ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తారని అన్నారు. అందుకే వారి పేర్లు చెప్పి ఉత్సాహ పరిచారని అన్నారు. చిత్ర పరిశ్రమపై ఆధారపడి ఎన్నో వేలాది మంది బతుకుతున్నారని అన్నారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారని అన్నారు.
ఆ గొడవలు రేపింది వైసీపీనే
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడానికి అభిప్రాయ సేకరణ ఎందుకు చేశారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. పెట్టాలనుంటే నేరుగా ఆ పేరు పెడితే ఎలాంటి గొడవలు జరిగి ఉండేవి కావని అన్నారు. ఈ గొడవల కారణంగా అమాయకులైన 250 మంది ప్రజలను జైల్లో పెట్టారని అన్నారు. వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రకరకాల నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఓపీఎస్, జీపీఎస్ అంటూ తప్పించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మేం అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు కోసం శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 2019లో ఆలోచించి ఓటు వేసి ఉంటే కనీసం లక్ష ఉద్యోగాలైనా భర్తీ చేసే వాళ్లమని చెప్పారు. పోరాటం చేసే వారికే ఓటు వేసి గెలిపించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పక్షాన ప్రజలు నిలబడాలని ప్రజలను కోరారు.
‘‘కోనసీమ నుంచి చమురు సహజవాయువులు ఇక్కడి నుంచి తరలించుకుపోతున్నారు. కానీ తగిన ఉపాధి కల్పించడంలేదు.. సీఎస్సార్ నిధులు కేటాయించడంలేదు. స్కిల్ డెవలప్‌మెంట్ ఎందుకు కల్పించడంలేదు. నేను మీ తరపున పోరాటం చేస్తాను. జనసేనను బలమైన సత్తాగా మీరు బలపరిస్తే బలంగా వినిపిస్తాం. విద్య, వైద్యం సంపూర్ణంగా అందరికీ అందేలా జనసేన తరపున నేను కృషిచేస్తాను. జనసేన అధికారంలోకి వస్తే ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తాం.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను. అంబేడ్కర్ పేరు ఉన్న విదేశీ విద్యను ఎందుకు తొలగించావు? అంబేడ్కర్ గారికంటే గొప్పవాడివా జగన్మోహన్ రెడ్డి? దళితులకు మేనమామ లాంటి పదాలు నమ్మకండి. గాంధీ దళితులను హరిజనులు అంటే దళితులపట్ల జాలి చూపించవద్దు అని అన్నారు. కేవలం దళితుల రక్షణకు చట్టాలు చేయాలని కోరారు. రాజ్యాంగ బద్దమైన రక్షణ కల్పించు 23 దళిత పథకాలు ఎందుకు తీసేశారు? అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ మాట్లాడారు.