No entry at Sc colony: దళిత కాలనీలోకి రాజకీయ నాయకులకు ప్రవేశం లేదు! మండపేటలో దళితుల అల్టిమేటం
దళితులకు స్మశాన వాటిక, జల్లు స్నానఘట్టంఇచ్చే వరకు రాజకీయ నాయకులకు దళిత కాలనీలోకి ప్రవేశం లేదని, ఓట్లు అడిగే హక్కులేదని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా మండపేట నియోజకవర్గంలోని అర్తమూరు దళిత కాలనీ వాసులు వారిపేట ముఖద్వారం వద్ద ఒక ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. దళితులకు స్మశాన వాటిక, జల్లు స్నానఘట్టంఇచ్చే వరకు రాజకీయ నాయకులకు దళిత కాలనీలోకి ప్రవేశం లేదని, ఓట్లు అడిగే హక్కులేదని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని మండపేట నియోజకవర్గం పరిధిలోని ఆర్తమూరు గ్రామంలో ప్రస్తుతం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోంది. ఈప్రాంతంలో ప్రజాప్రతినిధులు, నాయకులు ఇంటింటా తిరుగుతూ గ్రామ సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకు అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.. అదేశాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆర్తమూరు గ్రామంలోని దళిత కాలనీలో ముఖద్వారం వద్ద స్థానిక దళిత నాయకులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
దీర్ఘకాల సమస్య.. పరిష్కారం ఏది..?
ఆర్తమూరు గ్రామంలోని దళిత కాలనీలో సుమారు 375 కుటుంబాలు దాదాపు 1500 మంది నివశిస్తున్నారు. ఇక్కడ వీరంతా దళితులే కాగా వీరంతా రామవరం రోడ్డు మార్గంలో చనిపోయిన వారి మృతదేహాలను ఖననం చేస్తుంటారని, అయితే అక్కడ ఎటువంటి సదుపాయాలు లేకపోగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని దళితులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇక్కడ జల్లు స్నానఘట్టం ఏర్పాటు చేయాలని అధికారులను కోరగా పంచాయతీ పాలకవర్గం దీనిని వ్యతిరేకించింది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ, స్థానిక వైసీపీ ఇంచార్జ్ తోట త్రీమూర్తులు చొరవతో సమీపంలోని ఓ ప్రభుత్వ స్థలాన్ని సేకరించి దళితులకు అప్పగించారు. ఇక్కడ దహన సంస్కారాలు చేస్తున్న క్రమంలో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో అక్కడ సంస్కారాలు నిర్వహించుకోకుండా ఆగిపోయింది. పాతస్థలంలో చేసుకుందామని ప్రయత్నిస్తుంటే అది ఆర్‌అండ్‌బీ స్థలమని, ఇక్కడ ఎటువంటి ఎటువంటి ఖననాలు చేయవద్దని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో ప్రభుత్వ అధికారులు చుట్టూ తిరుగుతున్నా తమకు ఎటువంటి న్యాయం జరగలేదని, దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం చొరవ తీసుకోవాలి..
దళితులమైన తమకు స్మశాన వాటిక సమస్య సరిష్కారం లభించలేదని గత కొంతకాలంగా అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నా ఏమాత్రం ప్రయోజనం లేకపోయిందని ఆర్తమూరు గ్రామంలోని దళితకాలనీ వాసులు వాపోతున్నారు. ఎమ్మెల్సీ, నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ తోట త్రీమూర్తులు ఈ ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటా తిరుగుతున్నారు. ఈనేపథ్యంలో తమ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఏ నాయకులు తమ పేటలకు రానవసరం లేదని, ఓటు అడిగే హక్కు లేదని ముఖద్వారంలోనే అంబేడ్కర్ చిత్రపటంతో ఓ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు స్థానికులు. ఇది స్థానికంగానే కాక నియోజకవర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది.