Satyamevajayathe Deeksha: ఢిల్లీలో లోకేష్, జైలులో చంద్రబాబు, రాజమండ్రిలో భువనేశ్వరి నిరాహార దీక్ష, సంఘీభావంగా టీడీపీ శ్రేణులు నిరశన
Satyamevajayathe Deeksha: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
Satyamevajayathe Deeksha: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేతలు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. గాంధీ జయంతి రోజున సత్యమేవజయతే పేరుతో దీక్షలకు కూర్చున్నారు. సాయంత్రం వరకు జరిగే దీక్షల్లో అగ్రనేతలతో పాటు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్షను మొదలుపెట్టారు. రాజమండ్రి జైలులో చంద్రబాబు, బయట నారా భువనేశ్వరిలు చేపట్టిన దీక్షలకు మద్దతుగా ఢిల్లీలో యువనేత నిరాహార దీక్ష చేపట్టారు.
దీక్షకు వెళ్లే ముందు స్వాతంత్ర్య సమరయోధుడు, దివంగత ప్రధాన మంత్రి లాల్ బహూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళి అర్పించారు. లాల్ బహదూర్ శాస్త్రి.. నిష్కళంక, నిస్వార్థ ప్రజాసేవకులు అని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి పాటుపడతామని నారా లోకేశ్ అన్నారు.
టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో లోకేశ్ దీక్షకు మద్దతు తెలిపేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు. దీక్షలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తన అక్రమ అరెస్టుకు నిరసనగా చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. చంద్రబాబు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు సంఘీభావంగా రాజమండ్రిలోనే ఉన్న ఆయన సతీమణి నారా భువనేశ్వరి దీక్షబూనారు. సత్యమేవ జయతే పేరుతో తలపెట్టిన నిరహార దీక్షకు వెళ్ళే ముందు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు నారా భువనేశ్వరి. మంగళగిరిలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. వీరి దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు దీక్షలు చేపడుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షలు కొనసాగనున్నాయి.