East Godavari: ముసలమ్మకు రూ.30 లక్షలతో అలంకరణ! భక్తుల నమ్మకం ఏమిటో తెలుసా?
East Godavari Viral News: కడియపులంకలో ఉన్న ముసలమ్మ అమ్మవారిని 30 లక్షల రూపాయల విలువైన నోట్లతో అందంగా అలంకరించారు. అమ్మవారిని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

East Godavari Viral News: శ్రావణ శుక్రవారం నాడు పలు లక్ష్మీదేవి ఆలయాలను నోట్ల కట్టలతో అలంకరించి పూజలు జరపడం ఈ మధ్య కాలంలో ఆనవాయితీగా మారింది. తాజాగా ఈ సంప్రదాయం గోదావరి జిల్లాలకూ అలవాటు అయ్యింది. అయితే ఇక్కడ కేవలం లక్ష్మీదేవికే కాకుండా ఇతర అమ్మవార్లకు సైతం డబ్బులతో పూజలు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండల కేంద్రంలో ఉన్న శ్రీ పుంతలో ముసలమ్మ వారిని రూ.30 లక్షల నోట్లతో అందంగా అలంకరించారు. శ్రావణమాసం వరలక్ష్మి దేవి వ్రత సందర్భంగా శుక్రవారం ఈ అమ్మవారికి అలంకరణ జరిగింది. ధనలక్ష్మి అమ్మవారిగా శ్రీ ముసలమ్మవారు దర్శనమిచ్చారు. సిరులను కురిపించే ధనలక్ష్మి దేవిగా కొత్త నోట్లతో అమ్మవారు కళకళలాడిపోతున్నారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూ కట్టారు. ఈ అలంకరణ మూడు రోజుల పాటు ఉండనుంది. గత ఐదేళ్లుగా ఈ ఆచారం కొనసాగుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు.
5లక్షలతో ప్రారంభం అయి.. ఈ ఏడాది 30 లక్షల రూపాయలతో అలంకరణ
ఐదేళ్ల క్రితం 5 లక్షల రూపాయలతో ప్రారంభమైందీ ప్రత్యేక పూజ. ఇలా ప్రతి ఏడాదీ 5 లక్షల చొప్పున పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏడాది 30 లక్షల రూపాయలతో అమ్మవారిని అలంకరించారు. శ్రీదేవి రూపంలో ప్రస్తుతం పుంతలో ముసలమ్మ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. విజయవాడ కనకదుర్గకు జరిగిన పూజలే ఈ మూడు రోజులు కడియపులంకలోనూ జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు.
ఈ అలంకరణ కోసం కొత్త నోట్లు సేకరించడం దగ్గర నుంచి వాటిని అందంగా కూర్చడం వరకూ దాదాపు నెలరోజులు పడుతుంది అనీ గ్రామస్తులు అంతా కష్టపడి ఈ పనిని చేస్తారని ఆలయ కమిటీ అంటోంది. ఈ డబ్బు అంతా కడియపు లంక నర్సరీ రైతుల నుంచి సేకరించినట్టు చెబుతున్నారు. ఇలా తమ డబ్బును అమ్మవారి అలంకరణ కోసం ఇస్తే రెండింతలు అవుతుందని నమ్ముతారని భక్తులు విశ్వాసం.
దాదాపు 60 ఏళ్లుగా పూజలు అందుకుంటున్న పుంతలో ముసలమ్మ అమ్మవారి పాత గుడితో సహా కొత్తగా 5 ఏళ్ల క్రితం కట్టిన శ్రీదేవి గుళ్లకు ప్రతీ శ్రావణ శుక్రవారం (వరలక్ష్మి వ్రతం) నాడు కరెన్సీ కట్టలతో, దీపావళి నాడు పలు రకాల స్వీట్స్‌తో అలంకరణ చేస్తారు.అలాగే సంక్రాంతి నాడు ఇక్కడ జరిగే ముగ్గుల పోటీలకు పెద్ద పేరే ఉంది.





















