Mudragada Padmanabham : జగన్‌ను మరోసారి సీఎంను చేద్దాం కలిసి రండి- ప్రజలకు ముద్రగడ బహిరంగ లేఖ
Mudragada Padmanabham : జగన్ ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతోపాటు, అభివృద్ధిని చేయించాలని ఆశతో ఉన్నాను అందుకే ఆయన్ని రెండోసారి సీఎంగా చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ముద్రగడ.
Andhra Pradesh News: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని మరోసారి సీఎం కుర్చీలో కూర్చొబెడదామంటూ ప్రజలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు అన్న ఆయన... వైసీపీ అధినేత ఆహ్వానం మేరకు తాను ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
ఆయన లేఖలో ఇంకా ఏం రాశారంటే... ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికి తెలుసు అని అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి పిలుపు మేరకు వై.యస్.ఆర్.సి.పిలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నారు. మరోసారి జగన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడానికి కృషి చేస్తాను. ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి పని చేయాలని నిర్ణయించాను.
జగన్ ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతోపాటు, అభివృద్ధిని చేయించాలని ఆశతో ఉన్నాను. మీ బిడ్డను అయిన నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. చేయను కూడా. 14న వై.యస్.ఆర్.సి.పిలోకి చేరనున్నారు. ఉదయం 8 గంటలకు కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వెళ్లి అక్కడ జగన్ సమక్షంలో పార్టీలో చేరుతాను. ఈ ప్రయాణంలో మీరు కూడా పాలుపంచుకోవడానికి రావాలని ప్రార్థిస్తున్నాను. మీ కావలసిన ఆహారం, ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోవాలని కోరుతున్నాను అంటూ ముగించారు.
అమరావతి వెళ్లే రూట్ మ్యాప్‌ను కూడా లెటర్‌లో పొందుపరిచారు. కిర్లంపూడిలో బయల్దేరి ప్రత్తిపాడు, జగ్గంపేట, లాలా చెరువు, వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు మీదుగా విజయవాడ అక్కడి నుంచి తాడేపల్లి చేరుకుంటారు.