Mahasena Rajesh: మహాసేన రాజేష్ టికెట్ మార్పు? అక్కడ కొత్త అభ్యర్థిని పరిశీలిస్తున్నారా?
Mahasena Rajesh: టీడీపీ-జనసేనపై ఆ ప్రభావం పడకుండా ఉండేందుకు అవసరమైతే పోటీ నుంచి వైదొలుగుతానని సోషల్ మీడియాలో సరిపెళ్ల రాజేష్ పోస్టు చేశారు.
P Gannavaram Politics: పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నియమితులైన సరిపెళ్ల రాజేష్ సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే తాను పోటీ నుంచి వైదొలుగుతానని అన్నారు. వైసీపీ కార్యకర్తలు చేస్తున్న దుష్ప్రచారంతో పార్టీకి నష్టం కలగకూడదని.. టీడీపీ-జనసేనపై ఆ ప్రభావం పడకుండా ఉండేందుకు అవసరమైతే పోటీ నుంచి వైదొలుగుతానని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పి. గన్నవరం నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో.. టీడీపీ సరిపెళ్ల రాజేష్ (మహాసేన రాజేష్) ను టీడీపీ ప్రకటించింది. ఆ వెంటనే వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తనపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తున్నారని మహాసేన రాజేష్ ప్రకటించారు. కాకినాడ జిల్లా ఉత్తరకంచిలోని తన నివాసంలో ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. అంతకుముందు ఒక వీడియో విడుదల చేశారు.
ఈ సందర్భంగా మహాసేన రాజేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఒక సామాన్యుడికి అవకాశం వస్తే వ్యవస్థ ఎలా ఏకమైపోతోందో రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. తనను అభ్యర్థిగా ప్రకటించి పోటీ చేయడానికి ప్రయత్నిస్తుంటేనే ఇంతలా దుష్ర్పచారం చేస్తున్నారంటే.. ఒకవేళ గెలిస్తే తనను చంపేస్తారేమో అని అన్నారు. తన పాత వీడియోలను ఎడిట్ చేసి తనతో పాటు టీడీపీ జనసేన నేతలను కించపరిచేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోందని అన్నారు. ఏడేళ్ల క్రితం మాట్లాడిన మాటలను వక్రీకరిస్తున్నారని.. ఇది సరైంది కాదని అన్నారు. తన వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనుకుంటే తాను వైదొలగడానికి కూడా రెడీ అని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచన తనకు ఉందని.. అంతేకానీ, తనకు పదవులు అవసరం లేదని అన్నారు. వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ రెడ్డి, సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు అనంతబాబుకు ఏ అడ్డూ లేదని గుర్తు చేశారు. వాళ్లు పోటీచేస్తూ.. ప్రచారమూ చేస్తారని.. కానీ మహాసేన రాజేష్ మాత్రం పోటీ చేయకూడదని వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఒకవేళ అధిష్ఠానం తప్పదంటే, పోటీచేసి గెలిచే మొట్టమొదటి నియోజకవర్గం పి.గన్నవరమే అని రాజేష్ స్పష్టం చేశారు.
మోకా బాలగణపతిని ఖరారు చేస్తారా?
మహాసేన రాజేష్ వ్యాఖ్యలతో ఆయన టికెట్ ను మరొకరికి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. రాజేష్ స్థానంలో పి గన్నవరం స్థానంలో మోకా బాలగణపతిని నియమిస్తారని అంటున్నారు. కాట్రేనికోనకి చెందిన మోకా ఆనంద్ సాగర్ కుమారుడు బాలగణపతి. పి. గన్నవరం అభ్యర్థి మార్పు విషయంలో ఫోన్ కాల్స్ ద్వారా టీడీపీ అధిష్ఠానం సర్వే చేస్తున్నట్లు తెలిసింది.