Konaseema District: కోనసీమలో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే ‘గాడిద’ దుమారం - కలెక్టర్ సహా అధికారులు షాక్
BR Ambedkar Konaseema District: మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఒకరినొకరు గాడిదను పోల్చుకుని పరస్పర వ్యాఖ్యలు చేయడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
కోనసీమ జిల్లా నిండు సభలో " గాడిద " దుమారం..!
ఒకరినొకరు విమర్శించుకున్న ఎమ్మెల్సీ తోట, ఎమ్మెల్యే వేగుళ్ల..
జరిగిన పరిణామంతో కలెక్టర్ సహా అధికారులు షాక్
BR Ambedkar Konaseema District: కోనసీమ జిల్లా మండపేటలో జరిగిన వైఎస్సార్ ఉచిత పంటల బీమా కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య గాడిద వ్యాఖ్యలు దుమారం రేపాయి. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు (టీడీపీ), వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఒకరినొకరు గాడిదను పోల్చుకుని పరస్పర వ్యాఖ్యలు చేయడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇదే నియోజకవర్గంలో జరిగిన ఓ సభలో ఎమ్మెల్యే వేగుళ్ల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు గాడిదలు కాస్తున్నారా..? అంటూ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఇదే నియోజకవర్గంలో జరిగిన మరో సభకు హాజరైన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వేదికపై ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఉండగానే ఎమ్మెల్యేను గాడిదతో పోల్చుతూ స్వాగతం అంటూ అవహేళనగా మాట్లాడడం అక్కడున్నవాళ్లంతా అవాక్కవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే వేదికపై ఉన్న కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతోపాటు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యే జోగేశ్వరరావు కూడా విస్తుపోవడం వంతయింది. అసలే ఓ వైపు కోనసీమ అల్లర్ల కేసు, మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబు వివాదం కొనసాగుతుండగా.. తాజాగా నేతల మధ్య కొత్తగా గాడిద వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఒకరు పరోక్షంగా.. మరొకరు ముఖం మీదే కామెంట్..
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో పలు చోట్ల జిల్లా కలెక్టర్ హిమాన్సుశుక్లా నేతృత్వంలో రైతు సదస్సులు నిర్వహించారు. ఈసందర్భంగా రైతాంగ సమస్యల గురించి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పలు అంశాలు లేవనెత్తారు. ఇదే సందర్భంలో రైతుల ఇబ్బందులను ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవాలని, అధికార పార్టీ నాయకులు గాడిదలు కాస్తున్నారా అని పరోక్షంగా ఎమ్మెల్సీ తోట త్రీమూర్తులకు చురకలు అంటిస్తే.. మరికొద్దిసేపట్లోనే మరో సభలో ఎమ్మెల్యే ముందే ఎమ్మెల్యేను గాడిద అని ముఖంమీదే సంభోదిస్తూ స్వాగతం పలకడం చర్చనీయాంశం అయింది. అయితే మాటకు మాట అనేది తోట త్రిమూర్తులుకు కొత్తకాకపోగా పలు సందర్భాల్లో ఎవరైనా విమర్శలు చేస్తే ప్రతివిమర్శ అదే వేదికపై చేయడం తోటకు పరిపాటి అని.. అయితే ఇప్పుడు కాస్త డోస్ ఎక్కువయ్యిందని స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు.