(Source: ECI/ABP News/ABP Majha)
Konaseema: కేసుల ఎత్తివేతతో నష్టనివారణ జరుగుతుందా ! అమలాపురంలో రాజుకుంటోన్న మరో చిచ్చు!
అమలాపురం అల్లర్ల కేసులు ఎత్తివేసేందుకు ప్రణాళిక సిద్ధంచేస్తోన్న వైసీపీ ప్రభుత్వం కొత్త సమస్యను ఎదుర్కోబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా... అమలాపురం అల్లర్ల కేసులు ఎత్తివేసేందుకు ప్రణాళిక సిద్ధంచేస్తోన్న వైసీపీ ప్రభుత్వం కొత్త సమస్యను ఎదుర్కోబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల ఇంఛార్జ్, ఎంపీ మిథున్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా అమలాపురం అల్లర్ల కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీనిపై ఇప్పటికే ఆ కేసుల్లో ఉన్న నిందితుల్లో కొందరు వైసీపీలో ఉన్న నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రెస్‌మీట్లు కూడా పెట్టారు. ఇప్పుడు ఇదే విషయంలో దళిత వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రగిలిస్తోంది.
వైసీపీ బలమైన ఓటుబ్యాంకు ఉన్న దళిత వర్గాలు ఈ విషయంపై విస్మయాన్ని వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ దళిత మంత్రి ఇంటికి నిప్పుపెట్టడమే కాకుండా ఓ బీసీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పుపెట్టడం, అనేక ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేయడం వంటి విపరీత పరిస్థితులను ఇలా ఓటుబ్యాంకు రాజకీయం కోసం వైసీపీ ప్రభుత్వం దారుణమైన నిర్ణయాలను తీసుకుంటుందని ఇప్పటికే దళిత వర్గాల నేతలు మండిపడుతున్న పరిస్థితి సర్వత్రా కనిపిస్తోంది.
ఆ నాయకుల ట్రాప్‌లో పడుతోందంటూ ఆరోపణ..
అమలాపురం అల్లర్ల కేసుల ఎత్తివేత వ్యవహారంలో కీలకంగా ఇద్దరు పేర్లు చర్చకు దారితీశాయి. ఉభయగోదావరి జిల్లాల ఇంచార్జ్, ఎంపీ మిథున్ రెడ్డి వద్దకు ఈసమస్యను తీసుకెళ్లడం దగ్గర నుంచి అధిష్టానాన్ని ఒప్పించగలగడం వంటి పరిస్థితులకు కీలకంగా వ్యవహరించిన వారిలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు ఉన్నారు. అయితే తోట త్రీమూర్తులు దళిత వ్యతిరేకని, ఆయనపై దళితుల శిరోముండనం వంటి కేసులు ఉండగా అన్నీ తెలిసికూడా వైసీపీ ప్రభుత్వం ఆయనకు అత్యంత ప్రాధాన్యతినిస్తోందని వైసీపీలోని దళిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే రాజ్యసభ సభ్యుడు పిల్లి చంద్రబోస్ కూడా అమలాపురం అల్లర్ల కేసుల్లో నిందితులుగా ఉన్న వారు ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉండడం కూడా ఆయనకూడా ఓ సామాజిక వర్గం వైసీపీకు దూరమైపోతుందని, దానినష్ట నివారణకు కేసులు ఎత్తేయడమే సరైందని సూచించినట్లు చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలు నిశితంగా పరిశీలిస్తున్న వైసీపీలోని దళిత వర్గాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని ఆపార్టీ నాయకులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
అమలాపురం అల్లర్లలో నష్టపోయిన మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌లు తమ పదవులను కాపాడుకునేందుకు కేసుల ఎత్తివేత వ్యవహారంలో అధిష్టానానికి ఎదురుతిరిగే ప్రసక్తి లేదని, అయితే ఆనాటి పరిస్థితులు కళ్లారా చూసిన తాము మాత్రం కేసులు ఎత్తేస్తే తగిన గుణపాఠం చెబుతామని ఇప్పటికే అంతర్గత సమావేశాలు నిర్వహించుకున్న వైసీపీ దళిత వర్గాలు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం ఆ నాయకుల ట్రాప్‌లో పడిరదంటూ దళితవర్గాలు ఆరోపిస్తున్నాయి.
నష్టనివారణ చర్యల్లో కొత్త చిక్కులు..
అమలాపురం అల్లర్ల కేసుల్లో కేసుల ఎత్తివేత విషయంలో వైసీపీ పార్టీకు కొత్తచిక్కులు ఎదురవ్వక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అల్లర్ల కేసుల వల్ల వైసీపీకు దగ్గర గా ఉన్న శెట్టిబలిజ వర్గం దూరమయ్యిందని, ఇందుకోసమే నష్టనివారణ చర్యలు చేపట్టినట్లు ఆ పార్టీ నాయకులు బాహాటంగా చెబుతున్నారు. ఇందులోభాగంగా ఎమ్మెల్సీ పదవి శెట్టిబలిజ సంఘ నాయకుడు కుడిపూడి సూర్యనారాయణరావు ఇచ్చారు. ఇందులో కూడా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కీలకంగా వ్యవహరించారు. స్వయంగా ఎమ్మెల్సీగా ఎన్నికై సూర్యనారాయణరావు తనకు ఈ పదవి కేవలం త్రీమూర్తుల వల్లనే వచ్చిందని బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు కేసుల ఎత్తివేత విషయంలోనూ అధిష్టానం తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందని, అదే జరిగితే ఈ తరహా నిర్ణయాలు నష్టనివారణకు ఏమాత్రం ఉపయోగపడవని, వైసీపీకు బలమైన దళిత వర్గాలు ఓట్లు, ప్రాముఖ్యమంగా మాల సామాజికవర్గ ఓట్లు దూరమయ్యి మరింత నష్టం జరగబోతుందని మాత్రం ఆపార్టీ దళితవర్గ నాయకులే హెచ్చరిస్తున్నారు.
కేసులు ఎత్తేస్తే సహించం..
అమలాపురం అల్లర్ల కేసులు ఎత్తేస్తే సహించబోమని ఇప్పటికే దళితసంఘాల నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. యువకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసులు ఎత్తేస్తామని మిథున్‌రెడ్డి ప్రకటించడం దారుణమని, రాజ్యాంగాన్ని వీరి చేతుల్లోకి తీసుకుని న్యాయవ్యవస్థను కూడా శాసిస్తున్నారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ ఎలాగూ వైసీపీ ప్రభుత్వ చెప్పుచేతల్లోకి వెళ్లిపోయిదని, ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉన్న కేసులను కూడా మాఫీ చేయడం ఎంతవరకు సరైందని ప్రశ్నిస్తున్నారు. కేసులు ఎత్తేస్తే ఉద్యమబాట పడతామని ఇప్పటికే సమావేశమైన దళితసంఘాల నాయకులు హెచ్చరించారు. అయితే వైసీపీలో ఉన్న దళిత వర్గాలు మాత్రం బహిరంగ ప్రకటనలు చేయడం లేదు. ఈ పరిణామాలు ఏ పరిస్థితికి దారితీస్తాయో వేచిచూడాల్సి ఉంది.