CM Jagan Photo: సీఎం జగన్ ఫోటోను రథంపై ఊరేగించిన ప్రజలు, ఈ సంబరాలు ఎందుకో తెలుసా?
ఈ నాలుగు గ్రామాలకు ఇప్పుడు వంతెన నిర్మాణం కల సాకారమవ్వబోతోంది. గత వరదల సందర్భంగా జగన్మోహన్‌రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించి హామీ ఇచ్చారు.
లంక వాసులంతా దాదాపు ఒక్కటై ఈ హడావిడి చేశారు.. ఇంతకీ ముఖ్యమంత్రి జగన్‌పై ఎందుకింత అభిమానాన్ని చూపించారనే కదా.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే లంక గ్రామాల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. గంటి పెదపూడి వద్ద గోదావరి పాయ అవతలివైపున ఉన్న నాలుగు గ్రామాల ప్రజలకు రోడ్డు సదుపాయం లేదు. వేసవి కాలంలో అయితేనే ఎండిపోయిన నదీపాయమార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.. అదే వరదల సమయంలో అయితే ఖచ్చితంగా పడవలే ఆశ్రయం.. దశాబ్ధాల కాలంగా వంతెన నిర్మించాలని ఈ గ్రామాల ప్రజల చిరకాల కోరిక.. ఈ కల ఇంతవరకు నెరవేరలేదు. వరదల సమయంలో పరీక్షలు రాసే విద్యార్థులు, ఆసుపత్రికి వెళ్లే రోగుల అవస్థలు వర్ణనాతీతం.. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నాలుగు గ్రామాలకు ఇప్పుడు వంతెన నిర్మాణం కల సాకారమవ్వబోతోంది.. దీంతో ఈ గ్రామాల ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది..
హామీ ఇచ్చి రూ.50 కోట్లు విడుదల..
ఇటీవల కోనసీమకు వరదలు పోటెత్తిన సందర్భంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించారు. ఆ సమయంలో ఊడిమూడలంక, గంటిపెదపూడి లంక, అరిగెలవారిపేట, బూరిగులంక, వద్ద బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే అన్నట్లుగానే యద్ధప్రాతిపదికన ఈ లంక గ్రామాలకోసం వంతెన నిర్మాణం చేపట్టేందుకు రూ.50 కోట్లు విడుదల చేశారు. దీంతో ఈప్రాంతాన్ని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు పరిశీలన చేసి
వంతెన నిర్మాణ పనులు కోసం సాంకేతిక నిపుణులు పరిశీలన చేస్తున్నారు. దీంతోఈలంక గ్రామాల ప్రజల సంతోషానికి అవధులు లేకుండాపోయింది. దశాబ్ధాల కాలంగా తాము పడుతున్న ఇబ్బందులు తొలగనున్నాయని భావించిన ఈ లంక గ్రామాల ప్రజలు సీఎం జగన్ చిత్రపటాన్ని రధంపై ఊరేగించారు. బ్యాండు మేళాలు, బాణాసంచా డప్పు వాయిద్యాల నడుమ సీఎం ఫోటోను ఊరేగించి ఆపై పాలాభిషేకం చేశారు.
వంతెన నిర్మాణ స్థలంపై వివాదం..
వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.50కోట్లు మంజూరు చేయగా ఈ వంతెన మాగ్రామ పరిధిలో నిర్మించాలంటూ రెండు గ్రామాల ప్రజలు పట్టుపట్టడం కొంత వివాదానికి ఆజ్యం పోస్తోంది. దీనిపై సాంకేతిక నిపుణులు ఇప్పటికే రెండుచోట్ల సాయిల్ టెస్ట్ లు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో ఊడిమూడి లంక గామపరిధిలోకి వచ్చే చింతావారిపేట, ఉచ్చులవారిపేట వద్ద పూర్వం శంకుస్థాపన చేశారు. ఇక్కడ ప్రభుత్వ భూమి ఉందని, కొత్తగా భూమిని సేకరించాల్సిన అవసరం లేదు.. అందుకే వంతెన నిర్మాణం ఇక్కడే చేపట్టాలని కోరుతున్నారు ఆ గ్రామస్తులు.. ఇదిలా ఉంటే గంటి పెదపూడి వద్ద కొంత మంది వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ఇది చినికి చినికి కొంత వివాదాన్ని రేపగా అధికారుల ఇరు గ్రామాల పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడినట్లు తెలుస్తోంది.