Konaseema News: కోనసీమలో రైతులకు అలర్ట్.. దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలిస్తానన్న పవన్ కళ్యాణ్
కోనసీమ ప్రాంతంలో ఉప్పునీటి ముంపుకు గురయ్యి దెబ్బతిన్న కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు..దీంతో కొబ్బరి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కోనసీమ అనగానే మరో కేరళ అంటారంతా.. అటువంటి కోనసీమ ప్రాంతంలో ప్రధాన ఉద్యాన పంటగా కొబ్బరిపై రైతులు ఆధారపడి జీవిస్తుంటారు.. అయితే గత కొంతకాలంగా ఈ ప్రాంతంలోని డ్రైన్లలోనుంచి ఉప్పునీరు పొంగి వేలాది ఎకరాల కొబ్బరి తోటలు సర్వ నాశనం అవుతున్నాయి.. దీంతో కొబ్బరి రైతులు తీవ్ర నష్టాల్లోకి వెళుతున్నారు.. కొబ్బరికి సరైన గిట్టుబాటు ధర వచ్చే సమయంలో ఉప్పునీటి ధాటికి కొబ్బరి చెట్లు సర్వనాశనం అవుతున్నాయి.. చౌడుబారిన నేలగా మారుతోన్న క్రమంలో కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి.. లేదా గిడసమారిపోయి కొబ్బరి దిగుబడులు అమాంతంగా పడిపోతున్నాయి.. దీంతో ఈ ఉప్పునీటి ఊట వల్ల తేమశాతం బాగా పెరిగిపోయి నల్లముట్టు పురుగులు దాడిచేసి కొబ్బరినే నమ్ముకున్న రైతులకు కన్నీటిని మిగుల్చుతున్నాయి.. దీంతో ఈ సమస్యపై ముఖ్యంగా తీరప్రాంత రైతులు, నదీపాయలను, డ్రైన్లను ఆనుకుని ఉన్న భూముల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మేజర్ డ్రైన్లు ఆక్రమణలు తొలగించి కరకట్టలు పటిష్టం చేయాలని, మరోవైపు వైనతేయ, వశిష్ట నదీపాయలనుంచి పోటెత్తుతోన్న ఉప్పునీరు రాకుండా కరకట్టల నిర్మాణం చేపట్టి కొబ్బరి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు..
ఈ సమస్యపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
నదీపరివాహక ప్రాంతాలతోపాటు తీర ప్రాంతాల్లో కొబ్బరి తోటల్లోకి ఉప్పు నీరు చొరబడి కొబ్బరి తొటలు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తోండగా అసెంబ్లీ సమావేశాల్లో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావు అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.. ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.. దాంట్లో ఏమన్నారంటే.. కోనసీమ ప్రాంతంలోని శంకరగుప్తం మేజర్ డ్రయిన్ వెంబడి ఉన్న గ్రామాల్లోని కొబ్బరి తోటల్లోకి సముద్రపు నీరు చేరడం మూలంగా కొబ్బరి చెట్లు తలలు వాల్చేసి వేల ఎకరాలు దెబ్బ తిన్న విషయం నా దృష్టికి వచ్చింది. సముద్రపు పోటు సమయంలో ఉప్పు నీరు వైనతేయ పాయ నుంచి శంకరగుప్తం డ్రయిన్ లోకి చేరి అక్కడి నుంచి కొబ్బరి తోటల్లోకి పడుతోందనీ, ఫలితంగా చెట్లు తలలు వాల్చేసి దెబ్బ తిన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం... ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నాను. దసరా తరవాత అక్కడికి వెళ్ళి రైతాంగాన్ని కలిసి, తోటలు పరిశీలిస్తాను. రైతాంగంతోను, ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు, కొబ్బరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలతో చర్చిస్తాను అని పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేయడంతో కొబ్బరి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సుదీర్ఘకాలంగా వేధిస్తోన్న ఉప్పునీటి ముంపు సమస్య..
రాజోలు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఉప్పునీటి పోటెత్తడంతో కొబ్బరి తోటలు ముంపుకు గురయ్యాయి, ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాంకరగుప్తం,సఖినేటిపల్లి వంటి ప్రాంతాలు ప్రధానంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ప్రాంతం, మెండుపాలెం వద్ద ఈ పరిస్థితి దారుణంగా మారింది.. ఇక్కడ ఉన్న వేలాది ఎకరాల్లోని కొబ్బరి తోటల్లోకి మేజర్ డ్రైయిన్ నుంచి ఉప్పునీరు పోటెత్తి కొబ్బరి తోటల్లోకి ప్రవహిస్తోంది.. దీంతో ఇక్కడున్న వేలాది ఎకరాల కొబ్బరి తోటలు ప్రతీ ఏటా ఉప్పునీటి ముంపుకు గురయ్యి దెబ్బతింటున్నాయి.. సఖినేటిపల్లి, కేసనపల్లి, తూర్పు పాలెం, పడమటిపాలెం తదితర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చి మరికొన్నిచోట్ల డ్రెయిన్ ద్వారా ఉప్పునీరు తోటలలోకి చేరడం వల్ల లక్షకు పైగా కొబ్బరి చెట్లు నష్టపోయాయని రైతులు ఇప్పటికే పలు ఫిర్యాదుల్లో స్పష్టం చేశారు..
మానవతప్పిదాలే ప్రధాన కారణమా..
తీరప్రాంతాల్లో సీఆర్‌జడ్ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ ఆక్వా సాగుతో సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోన్న పరిస్థితి తలెత్తుతోందంటున్నారు పర్యావరణ హితులు.. దీనికి తోడు మేజర్ డ్రయిన్లను ఆనుకుని జరుగుతోన్న ఆక్వాచెరువుల తవ్వకాల వల్ల డ్రైయిన్లు ఆక్రమణలకు గురై కరకట్టలు దెబ్బతింటున్నాయని, సముద్రం పాటు పోట్లకు ఉప్పునీరు డ్రయిన్లలోకి పోటెత్తి సమీపంలో ఉన్న వేలాది ఎకరాల కొబ్బరితోటల్లోకి చొచ్చుకుని రావడంతో కొబ్బరి పంట తీవ్రంగా దెబ్బతింటుందంటున్నారు.. అంతే కాకుండా తీరానికి ఆనుకుని అక్రమ ఇసుక తవ్వకాలు, మడ అడవుల తగ్గుదల, కాలుష్యవ్యతిరేక చర్యలు, సీఆర్జెడ్ ఉల్లంఘన తీర ప్రాంతాలలో జరుగుతున్న మానవ తప్పిదాలే ప్రధాన కారణమంటున్నారు.





















