కోనసీమ జిల్లాల పునర్విభజన తర్వాత భూముల ధరలు పెరగడంతో, రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిందని, దీనితో ఏసీబీ దాడులు జరుగుతున్నాయని ఆర్టికల్ పేర్కొంది.
ACB Raids in Konaseema: కోనసీమలో లంచావతారాలు;వరసగా దొరికిపోతున్న అవినీతి చేపలు! తాజాగా ఏసీబీ వలకు చిక్కిన రెవెన్యూ తిమింగలం!
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పడ్డాక కోనసీమలో భూముల రేట్లుకు రెక్కలొచ్చాయి.మౌలిక సదుపాయాల కల్పనకు అడుగులు పడుతున్నాయి. ఈక్రమంలోనే వీటికి సంబంధిత శాఖల్లో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు.

ACB Raids in Konaseema: కోనసీమ జిల్లాల పునర్విభజన తరువాత వేగంగా అభివృద్ధి చెందుతోంది కోనసీమ ప్రాంతం.. ఈక్రమంలోనే ఇక్కడ భూముల రేట్లకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.. దీంతో ముఖ్యంగా రెవెన్యూ శాఖలో లంచావతారాలు మితిమీరిపోయి ఆర్జీదారుల నుంచి దండుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీఆర్‌ఏ స్థాయి నుంచి తహసీల్దార్ స్థాయి వరకు అన్నిచోట్ల లంచాలు లేనిదే ఏ పని అవ్వడం లేదంటున్నారు దరఖాస్తుదారులు. అటు జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాలు ఇప్పడిప్పుడే అభివృద్ధి అవుతుండగా ఈ గ్రామాల పరిధిలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు కూడా ఇదే తరహా అవినీతి లీలలు సాగిస్తున్నారంటున్నారు. ఇక జిల్లా కేంద్రమైన అమలాపురం టౌన్ ప్లానింగ్, అర్భన్ డెవలప్‌మెంట్, రూరల్ డెవలప్‌మెంట్ ఇలా అనేక శాఖల్లో అవినీతి జోరందుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ ఇటీవల కాలంలో ఒక్క అంబేడ్కర్ కోనసీమ ప్రాంతంలోనే ఏసీబీ అధికారుల దాడుల్లో అడ్డంగా బుక్కయిపోతున్నవారు కోనసీమ ప్రాంతం వారే ఉండడం విస్మయానికి గురిచేస్తోంది.
అడ్డంగా దొరికిపోయిన అమలాపురం తహసీల్దార్..
ఏసీబీ అధికారులు వలకు ఓ పెద్ద అవినీతి చేప చిక్కింది. అమలాపురం తహసీల్దార్ గా పనిచేస్తున్న పి.అశోక్ ప్రసాద్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికి పోయాడు.. రాజమండ్రి సమీపంలోని రాజవోలుకు చెందిన గంథం దుర్గా కొండలరావు తండ్రి గంధం సత్యనారాయణ అమలాపురం రూరల్ జనుపల్లిలో 15 సెంట్లు భూమిని గతంలో కొనుగోలు చేశారు. ఈ భూమిని విక్రయించేందుకు కొలతలు అవసరం కాగా దీని నిమిత్తం దుర్గా కొండల రావు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కొలతలు నిర్వహించాలంటే రూ.లక్ష ఇవ్వాలంటూ తహసీల్దార్ డిమాండ్ చేశాడు. చివరకు రూ.50 వేలు ముందస్తుగా ఇవ్వాలని, కొలతలు పూర్తయ్యాక మిగిలిన రూ.50 వేలు ఇవ్వాలని సూచించడంతో లంచం ఇవ్వడం ఇష్టంలేని ఫిర్యాదుదారుడు దుర్గా కొండలరావు రాజమండ్రి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో దుర్గా కొండలరావు నుంచి ఇదే తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తోన్న వీఆర్ ఏ రాము రూ.50 వేలు తీసుకుని తహసీల్దార్ అశోక్ ప్రసాద్‌కు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్ గా ఇద్దరూ దొరికి పోయారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్ అశోక్ ప్రసాద్, కంప్యూటర్ ఆపరేటర్ రాముపై కేసు నమోదు చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. ఈ విషయం స్థానికంగా పెద్ద సంచలనం అయ్యింది.. లంచాలకు రుచి మరిగిన అవినీతి అధికారుల్లో వణుకు మొదలయ్యింది..
రెవెన్యూ శాఖలో వరుసగా దొరికిపోయిన అవినీతి అధికారులు..
ఇటీవల కాలంలోనే తనకున్న పొలాన్ని మ్యుటేషన్ చేసి ఇచ్చేందుకు ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన ఓ రైతు నుంచి అదే గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్న వీఆర్వో రూ.20 వేలు డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేను. ఎంతో కొంత ఇస్తాను అని చెప్పినా రేపు రా.. మాపు రా.. అంటూ కాలం గడుపుతున్న వీఆర్వోపై విసుగెత్తని సదరు ఫిర్యాదుదారుడు రాజమండ్రి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సదరు వీఆర్వో తన స్వగ్రామం అయిన సామంతకుర్రు తీసుకువచ్చి లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నేరుగా ఏసీబీ అధికారులు ఫిర్యాదుదారుడ్ని తీసుకుని వెళ్లి లంచం ఇస్తున్న సమయంలో అడ్డంగా బుక్ చేశారు.
రెండు నెలల క్రింతం ఆలమూరు మండలంలో మహిళా సబ్ రిజిస్టర్ ఒకరు ఇలానే లంచం సొమ్ము తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. మూడు నెలల క్రితం రావులపాలెం పోలీస్ స్టేషన్‌లో సీఐ, అంతకుముందు ఏడాది క్రితం ఎస్సై ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రాజోలు నియోజకవర్గం పరిధిలోని సఖినేటిపల్లిలో వీఆర్వో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన మండలంలో ఓ వీఆర్వో లంచం సొమ్ము తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు.. ఇలా మొత్తం మీద అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రాంతంలో వరుసగా లంచావతరాలు దొరికిపోవడం చర్చనీయాంశం అవుతోంది..
దొరకని దొరలు చాలా శాఖల్లో అనేక మంది..?
లంచం ఇస్తేనే కానీ ఫైల్‌ను పక్కకు కూడా జరపని లంచావతరాలు ప్రభుత్వ శాఖలో తిష్టవేసుకుని ఉన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.. అందులోనూ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా ఏర్పడ్డాక భూముల రేట్లు ఆకాశంలోకి ఎగబాకడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పన విషయంలోనూ అభివృద్ధి పథంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోందని, ఈక్రమంలోనే అవినీతివైపు ప్రభుత్వ ఉద్యోగులు అర్రులు చాస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో అయితే కొంతమంది రెవెన్యూ శాఖలోని అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పట్టణంలోని టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులు, కొంతమంది సబ్ రిజిస్ట్రార్ ఇలా భూ సంబందిత వ్యవహారాలు చూసే శాఖల్లోని అధికారులు చాలా మంది లంచాల సొమ్ముకు అలవాటు పడి ప్రతీ పనిలోనూ బల్లకింద చేయిచాపే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.
Frequently Asked Questions
కోనసీమలో ఏసీబీ దాడులకు ప్రధాన కారణం ఏమిటి?
అమలాపురం తహశీల్దార్ ACB కి ఎలా దొరికిపోయారు?
భూమి కొలతల కోసం రూ.లక్ష డిమాండ్ చేసిన అమలాపురం తహశీల్దార్, రూ.50 వేలు లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.
ఇటీవల కోనసీమలో ఏయే శాఖల అధికారులు ACB కి దొరికిపోయారు?
ఇటీవల కాలంలో రెవెన్యూ శాఖలోని వీఆర్వోలు, మహిళా సబ్ రిజిస్ట్రార్, పోలీస్ స్టేషన్లలోని సీఐ, ఎస్సైలు ACB కి దొరికిపోయారు.
ప్రజలు ప్రభుత్వ శాఖల్లోని అధికారుల గురించి ఏమి ఆరోపిస్తున్నారు?
ప్రజలు అనేక ప్రభుత్వ శాఖల్లోని అధికారులు లంచం ఇస్తేనే పనులు చేస్తున్నారని, ముఖ్యంగా భూ సంబంధిత వ్యవహారాలు చూసే శాఖలలో అవినీతి ఎక్కువగా ఉందని ఆరోపిస్తున్నారు.





















