Konaseema District News : ఆత్మహత్య చేసుకుంటున్న వ్యక్తిని ఆరు నిమిషాల్లో కాపాడిన పోలీసులు- సెల్యూట్ చేస్తున్న జనం
Konaseema District News:ముగ్గురు పోలీసుల సమయస్ఫూర్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడగలిగింది. కేవలం 6 నిమిషాల వ్యవధిలో లొకేషన్ గుర్తించి అతని ప్రయత్నాన్ని భగ్నం చేశారు..

Konaseema District News: బలవన్మరణం.. ఒక్క క్షణపాటులో తీసుకునే అత్యంత భయంకరమైన నిర్ణయం.. ఆవేశంతోపాటు ఎంతో ఉద్వేగంతో క్షణాల్లో ఇక జీవించలేనంటూ జీవితానికి స్వస్తి పలికే పొరపాటు నిర్ణయం.. క్షణికావేశంతో ప్రాణాలు తీసుకునే ఆ సమయంలో గనుక తాను తీసుకునే నిర్ణయం తప్పు.. నీకంటే సమస్యలతో సతమతమవుతున్న వారు ఎందరు కాలంతో పోరాడి ఎలా బ్రతుకుతున్నారో చూడు.. నీకొచ్చిన కష్టం ఏపాటిది.. అని గనుక కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే తప్పకుండా చనిపోవాలనుకున్న నిర్ణయాన్ని మానుకుంటారు. అంతేకాదు.. ఇకపై ఆ నిర్ణయాన్ని ఎప్పడూ తీసుకోరు అని మానసిక శ్రాస్తాలు చెబుతున్నాయి. అయితే ఆక్షణంలో ఆ బలవన్మరణ ప్రయత్నాన్ని భగ్నం చేయాలి.. అడ్డుకోగలగాలి. సరిగ్గా ఇటువంటి ప్రయత్నమే ఓ పోలీసు అధికారి చేశారు.
సోషల్ మీడియాలో వచ్చిన సెల్ఫీ వీడియో చూసిన ఆ అధికారి వెంటనే స్పందించి మిగిలిన అధికారులను అప్రమత్తం చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలుకాపాడారు. కొద్ది క్షణాల్లో చనిపోదామని అనుకున్న ప్రయత్నాన్ని భగ్నం చేశారు. ఈ రోజున సజీవంగా ఉండేలా చేయగలిగారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లికి చెందిన యువకుడు ఆర్థిక ఇబ్బందులతో చనిపోదామని నిర్ణయం తీసుకున్నాడు. తాను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నానని కొద్ది సేపట్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోను బంధువులకు పంపించాడు. అది కాస్త వాట్సాప్‌లో వైరల్ అయింది.
Also Read: ఓటీటీ టైంలో ఆకట్టుకున్న నాటికలు- రంగస్థలంపై మెరుస్తున్న శ్రీకాకుళం జిల్లా పల్లెలు
ఆ వీడియో పి.గన్నవరం సీఐ ఆర్ భీమరాజుకు చేరింది. వెంటనే సీఐ స్పందించారు. ఉరి వేసుకుని చనిపోదామని నిర్ణయించుకున్న వ్యక్తిని కాపాడేందుకు పరుగులు పెట్టారు. ఫోన్ నెంబర్ ట్రేస్ చేశారు. స్విచ్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ మొబైల్ క్రెడియన్షియల్స్ ఉపయోగించి సెల్ ఐడితో లాస్ట్ లొకేషన్ గుర్తించారు. దీనికి ఐటీ కోర్ కానిస్టేబుల్ జాఫర్ సహాయం చేశారు.
లొకేషన్ ఆధారంగా వ్యక్తిని రక్షించిన పోలీసులు
చనిపోతానని చెప్పిన వ్యక్తి కాకినాడ జిల్లా అన్నవరంలో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అన్నవరం ఎస్సై శ్రీహరిని లైన్‌లోకి తీసుకుని అప్రమత్తం చేశారు. అన్నవరం ఎస్ఐ శ్రీహరి వెంటనే తమ సిబ్బందిని ఆ లొకేషన్‌కి పంపించారు.
వీడియోలో ఉన్న ఆధారాలను పరిశీలించిన పోలీసులు అతను లాడ్జిలో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఆ వీడియోను లాడ్జి ఓనర్స్ గ్రూపులో షేర్ చేసి వాళ్లందర్నీ కూడా అలెర్ట్ చేశారు. వెంటనే ఒక లాడ్జ్ యజమాని అతడిని గుర్తించి సరిగ్గా ఉరి వేసుకొని సమయంలో తలుపు బద్దలు కొట్టి లోనికి వెళ్లారు. అతని ప్రయత్నాని అడ్డుకున్నారు.
కేవలం ఆరు నిమిషాల వ్యవధిలోనే..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో మొదలైన ఈప్రక్రియ ఈ మొత్తం వ్యవహారం అంతా రాత్రి 11:21 నుంచి 11:27 మధ్యలో కేవలం ఆరు (6) నిమిషాల వ్యవధిలోనే జరగింది. ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలిగారు పోలీసులు. సీ.ఐ భీమరాజును, అన్నవరం ఎస్.ఐ శ్రీహరి, ఐ.టీ కోర్ కానిస్టేబుల్ జాఫర్‌కు ప్రాణాలతో బయటపడ్డా వ్యక్తి కుటుంబికులు, గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.
Also Read: 'తండేల్'ను వదలని పైరసీ భూతం... ఏపీ ఆర్టీసీ బస్సులో మరోసారి... ఆధారాలతో కంప్లయింట్ ఇచ్చిన నిర్మాత





















