Kallu Gita Workers: కల్లు గీత కార్మికుల కృతజ్ఞత ర్యాలీ, సీఎం చిత్రపటానికి పాలాభిషేకం!
Kallu Gita Workers: కల్లు గీత కార్మికులకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో.. కార్మికులు కృతజ్ఞాభివందన ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
Kallu Gita Workers: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కల్లు గీత కార్మికుల కృతజ్ఞతాభివందన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్లు గీత కార్మికులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో గీత కార్మికులు వి ఎస్ ఎం కళాశాల నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు రాలీ నిర్వహించి అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని నవరత్నాల పథకాల ద్వారా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారనికొనియాడారు. చంద్రబాబు నాయుడుసంక్షేమ పథకాలు అందించడంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలందరి ఆశీస్సులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2024లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లుతో గెలిచి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు..
ఆంధ్రప్రదేశ్‌లో కల్లుగీత వృత్తిపై ఆధారపడిన కార్మికుల సంక్షేమం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022 నుంచి 2027 వరకు కాలానికి కల్లు గీత పాలసీని తీసుకొచ్చింది. మద్యం నియంత్రణ విధానానికి అనుగుణంగా కల్లుగీత కార్మికుల కోసం ఈ విధానాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలోని 95 వేల 245 కల్లు గీత కార్మిక కుటుంబాలకు ప్రయోజనం కల్గనుంది. కల్లుగీత లైసెన్సింగ్ విధానం కూడా అత్యంత పారదర్శకంగా జరిగేలా పాలసీని రూపొందించారు. ఈ మేరకు సోమవారనే మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. కల్లుగీస్తూ ప్రమాద వశాత్తు మరణించిన కార్మికులకు చెల్లించే పరిహారాన్ని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారు.
ఇందులో 5 లక్షల రూపాయలు వైఎస్సార్ బీమా ద్వారా, మిగిలిన 5 లక్షల రూపాయలను ఎక్స్ గ్రేషియా రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. కల్లు గీత కార్మికుడు సహజ మరణం చెందితే అతని కుటుంబానికి వైఎస్సార్ బీమా పథకం ద్వారా 5 లక్షల పరిహారం అందుతుంది. అలాగే కల్లు రెంటల్స్ ను కూడా ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అలాగే కల్లుగీత కార్మిక సొసైటీలు గీచే వారికి చెట్టు పథకం, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో జాతుల వారు కల్లు గీసుకోవడం కోసం ఐదేళ్లకు లైసెన్సులు ఇస్తారు. ఒకవేళ ఎవరైనా కార్మికులు కల్లు గీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యానికి గురైతే ప్రత్యామ్నాయ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారా తగిన శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపిస్తారు. అలాగే వైఎస్సార్ బీమా ద్వారా నష్టపరిహారం చెల్లిస్తారు. అలాగే ఎన్ఆర్ఈజీఎస్, షెల్టర్ బెడ్ అభివృద్ధి పథకాల కింద తాటి, ఈత వంటి చెట్లను పెంపకానికి చర్యలు తీసుకోనున్నారు. అలాగే కాలువ గట్లు, నదీ, సాగర తీరాలను పటిష్టం చేస్తూ.. కల్లు గీతకు కావాల్సిన తాటి, ఈత చెట్లను సమృద్ధిగా పెంచనున్నారు.