Kakinada News: ఆరో తరగతి విద్యార్థిని అద్భుత ప్రతిభ, టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఏకంగా 488 మార్కులు
Kakinada News: ఆరో తరగతి విద్యార్థిని తన అద్భుత ప్రతిభను కనబర్చింది. పదో తరగతి పరీక్షలు రాసి 488 మార్కులు సాధించింది.
Kakinada News: కొంత మంది పిల్లలు హైపర్ యాక్టివ్ గా ఉంటారు. ఏదైనా చూడగానే ఇట్టే గుర్తు పెట్టుకుంటారు. ముఖ్యంగా చదువు విషయంలో మరింత ఫాస్ట్ గా ఉంటారు. చిన్న వయసులోనే పై చదువులు చదవడం, పరీక్షలు రాయడం చేస్తుంటారు. అలాగే తాజాగా ఓ విద్యార్థి తన ప్రతిభను చాటుకుంది. ఆరో తరగతి చదువతున్న ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్షలు రాసింది. అందులో 488 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
టాలెంట్ ను చూసి ఇంప్రెస్ అయి అనుమతి
కాకినాడ జిల్లా గాంధీ నగర్ మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని ముప్పల హేమశ్రీ పదో తరగతి పరీక్షల్లో సత్తా చాటింది. ఈ బాలిక అసమాన ప్రతిభను ఇక్కడి ఉపాధ్యాయులు కొన్నాళ్ల కిందట ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మార్చి 27వ తేదీన విజయవాడ సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్.. విద్యార్థిని హేమశ్రీ తెలివి తేటలను పరీక్షించారు. ఆమె టాలెంట్ ను చూసి ఇంప్రెస్ అయిన ఆయన గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలు రాసేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. శనివారం ప్రకటించిన ఫలితాల్లో ఆమె 488 మార్కులు సాధించింది. అయితే హేమశ్రీ తల్లి గృహిణి కాగా తండ్రి సురేష్ ప్రైవేట్ ఉద్యోగి. అయితే తమ కూతురు ఇంత చిన్న వయసులోనే పదో తరగతి పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు.
ఏపీలో శనివారం విడుదలైన పదో తరగతి ఫలితాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ మూడో తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలు ఫలితాలను శనివారం రోజు విడుదల చేశారు. మొత్తం 3,349 కేంద్రాల్లో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. గతేడాది తీవ్ర ఆరోపణలు వచ్చిన వేళ ఈసారి మరింత కఠినంగా వ్యవహరించారు. ఎక్కడా లీక్ సమస్య లేకుండా ఆదేశాలు జారీ చేశారు. 6,64,152 మంది రాసిన పదో తరగతి పరీక్ష పేపర్‌లను ఏప్రిల్ 19 నుంచి 26 వరకు మూల్యాంకనం చేశారు. గతేడాది పదోతరగతి ఫలితాల విడుదల సందర్భంగా జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈసారి ఆలంటి తప్పులకు అవకాశం లేకుండా చూసుకుంది. వాల్యుయేషన్ పక్కగా నిర్వహించామని చెబుతోంది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జరిగిన పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది కంటే ఐదు శాతం ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పాస్ పర్సంటేజ్ పెరిగింది. అది 3.47 శాతం గా ఉంది.
జిల్లాల వారీగా చూసుకుంటే ఉత్తీర్ణత శాతంలో మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా ఉంది. ఆ జిల్లాలో పాస్ పర్సంటేజ్ 87.4 శాతం ఉంది. అతి తక్కువ ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా వెనుకబడింది. అక్కడ పాస్ పర్సంటేజ్ 60.39శాతం. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పదో తరగతిలో పాస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 938 స్కూల్స్ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. 38 స్కూల్స్‌లో ఒక్కరు కూడా పాస్ కాలేదు. గతంలో పదోతరగతి పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్‌కు రెండేసి పేపర్లు ఉండేవి ఈసారి మాత్రం ఒక పేపర్ విధానం తీసుకొచ్చారు. ఈ పరీక్షలకు 6,09,081 మంది రెగ్యులర్ విద్యార్థులు అప్లై చేసుకోగా... అందులో6,05,052 మంది మాత్రమే పరీక్షలు రాశారు. పరీక్షకు హాజరైన వారిలో 3,09,245 మంది బాయ్స్ ఉంటే... 2,95,807 మంది బాలికలు ఉన్నారు.