Kakinada News :ఉప్పాడలో రాకాసి అలల బీభత్సం, బీచ్ రోడ్డు ధ్వంసం; మాజీ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం!
Kakinada News: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరం అల్లాడి పోతోంది. భారీ ఎత్తున ఎగిసి పడుతోన్న రాకాసి అలల తీవ్రతకు తీరప్రాంతం ధ్వంసం అవుతోంది..

Kakinada News : ఆంధ్రప్రదేశ్‌పై ఆవర్తన ప్రభావంతో ఉప్పాడలో సముద్ర అలలు ఎగిసిపడుతున్నాయి.. రాకాసి అలల తీవ్రతకు కాకినాడ - ఉప్పాడ బీచ్ రోడ్డు చాలా చోట్ల ధ్వంసమైంది. భారీ అలల తీవ్రతకు తీరం కోతకు గురికాకుండా రక్షణ కవచంగా వేసిన బండరాళ్లు సైతం కదిలిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఉప్పాడ తీరంలో సముద్ర అలల వల్ల జరుగుతోన్న నష్టాన్ని పరిశీలించేందుకు అక్కడకు వెళ్లిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎన్వీఎస్ఎస్ వర్మకు ప్రమాదం తప్పింది.. బీచ్ రోడ్డు మార్గంలో అనుచరులు, అధికారులతో కలిసి వెళ్తున్న క్రమంలో వెనుక ఒక్కసారిగా భారీ అల ఎగిసిపడి ఆయన్ను ఒక్కసారిగా మీద పడడంతో ఆయన ముందుకు పడిపోబోయారు.. ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఉదయం నుంచి కాకినాడ - ఉప్పాడ బీచ్ రోడ్డుపై రాకపోకలను నిషేధించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ, కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ వేర్వేరుగా ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించి స్థానిక మత్స్యకారులకు ధైర్యం చెప్పారు..
దెబ్బతిన్న ఉప్పాడ బీచ్ రోడ్డు, పలు మత్స్యకార ప్రాంతాలు..
ఉప్పాడ తీరం రోజు రోజుకు తరిగిపోతుంది. రాకాసి అలల బీభత్సానికి తీర ప్రాంతం భారీగా కోతకు గురవుతోంది. కాకినాడ వాకలపూడి నుంచి అమినాబాద్ శివారు హార్బర్ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈక్రమంలోనే అక్కడ గతంలో ఏర్పాటు చేసిన జియోట్యూబ్ సాంకేతికతో బండరాళ్లు కూడా కదిలిపోయి సముద్రంలోకి జారిపోతున్నాయి. దీంతో తీరాన్ని ధ్వంసం చేస్తున్న రాకాసి అలలు మరింత కోత కోసి సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. అయితే మరింత విధ్వంసం సృష్టించే అవకాశం లేకపోలేదని మత్స్యాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర అలల ఉద్ధృతికి కొత్తపట్నం గ్రామంలోకి సముద్రపు నీరు చేరింది. పల్లిపేట ప్రాథమిక పాఠశాలలో సముద్రపు నీరు భారీగా చేరడంతో విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. కెరటాల ఉద్ధృతికి సముద్రం నీరు తీరంను దాటుకుని పల్లిపేట, రంగూన్ పేట, కొత్తపట్నం తీరప్రాంతాల్లోని మత్స్యకారుల ఇళ్లల్లోకి చేరింది..
శాశ్వత పరిష్కారం కోసం పవన్ ప్రయత్నం..
ఉప్పాడ సముద్రం అలల తాకిడికి గురవుతున్న తీర ప్రాంతాన్ని శుక్రవారం రెవెన్యూ, మత్స్య, పంచాయతీరాజ్, పంచాయతీ, ఆర్ అండ్ బి శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పరిశీలించారు. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ, సుబ్బమ్మపేట వద్ద ఉదృతంగా వస్తున్న సముద్ర అలల తాకిటికీ దెబ్బతిన్న రోడ్డును, సమీప జనవాసంలోకి చేరిన సముద్రం నీటిని పరిశీలించి, అధికారులతో చర్చించి, తక్షణ పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ ధైర్యం చెప్పారు. సముద్ర అలల తాకిడికి ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తీరప్రాంత రక్షణకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటుని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.





















