Rapaka Varaprasad: క్రాస్ ఓటింగ్ చేయమన్నారు, సిగ్గు వదిలేసుంటే 10 కోట్లు వచ్చేవి - రాపాక సంచలనం
క్రాస్ ఓటింగ్ చేస్తే తనకు ఏకంగా రూ.10 కోట్లు ఇస్తామన్నారని ఎమ్మెల్యే రాపాక చెప్పారు. తనకంటే ముందు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు వచ్చిందని ఆరోపణ చేశారు.
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని తనకే మొదటి ఆఫర్ వచ్చిందని తెలిపారు. క్రాస్ ఓటింగ్ చేస్తే తనకు ఏకంగా రూ.10 కోట్లు ఇస్తామన్నారని చెప్పారు. తనకంటే ముందు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు వచ్చిందని ఆరోపణ చేశారు. క్రాస్ ఓటింగ్ చేస్తే టీడీపీలో మంచి పొజిషన్ ఇస్తానని అన్నారని చెప్పారు. తన దగ్గర డబ్బు లేదని, అలాంటి పరిస్థితుల్లో తాను సైలెంట్‌గా క్రాస్ ఓట్ చేసి డబ్బు తీసుకొని ఉండొచ్చని అన్నారు. కానీ, పరువు పోతుందని తాను ఆ పని చేయలేదని మాట్లాడారు. రాజోలు నియోజకవర్గంలోని ఓ సభలో మాట్లాడుతూ రాపాక ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో బాగా వైరల్ అయింది.
ఈ వీడియో గురించి రాపాక వరప్రసాద్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన వద్దకు ఈ ఆఫర్ ను ఉండి ఎమ్మెల్యే శివరామరాజు తీసుకొచ్చారని చెప్పారు. రూ.10 కోట్ల ఆఫర్ నేరుగా ఇవ్వలేదని, క్రాస్ ఓటింగ్‌లో అసలు డబ్బుల ప్రస్తావనే రాలేదని వివరణ ఇచ్చారు. మరి పది కోట్లు వస్తుందని స్వయంగా అన్నారు కదా అని ప్రశ్నించగా, అదేదో తాను సుమారుగా చెప్పానని అన్నారు. ఈ విషయాన్ని తాను ఎక్కడా చర్చించలేదని, మీడియాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. రాజోలులో జరిగిన ఓ ప్రైవేటు మీటింగ్ లో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలతో తాను ఈ విషయాన్ని పంచుకున్నానని అన్నారు. దీన్ని ఎవరో వీడియో తీసి వైరల్ చేశారని చెప్పారు.
నేను రాపాకకు ఏ ఆఫర్ చేయలేదు - ఉండి ఎమ్మెల్యే రామరాజు
తాను ఏనాడూ రాపాక వరప్రసాద్ కు ఏ ఆఫర్ గానీ, డబ్బుల ఆఫర్ గానీ చేయలేదని ఉండి ఎమ్మెల్యే రామరాజు స్పష్టత ఇచ్చారు. రాపాక వీడియో వైరల్ అయిన అనంతరం కాసేపటికి ఎమ్మెల్యే రామరాజు స్పందించారు. టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు వేయకపోయినా వైఎస్ఆర్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అసంతృప్తితో టీడీపీకి ఓటు వేస్తారని భావించామని అన్నారు. తాము అనుకున్నట్లుగానే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేశారని చెప్పారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, తానూ ఎప్పుడూ స్నేహపూర్వకంగానే మాట్లాడుకుంటామని, అసెంబ్లీ లాబీలో అప్పుడప్పుడు మాట్లాడుకుంటామని చెప్పారు. అయితే, ఆయన్ను తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదని ఉండి ఎమ్మెల్యే రామరాజు స్పష్టం చేశారు.