Godavari River Floods: గోదావరిలో పెరుగుతున్న వరద! దవళేశ్వరం వద్ద పది అడుగులు దాటిన నీటిమట్టం
Godavari River Floods: గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో అధికారులు లంక గ్రామాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. సముద్రంలోకి 2లక్షల క్యూసెక్కులకు పైబడి వరద నీరు వదలాలని చూస్తున్నారు.
Dowleswaram Barrage: ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు గోదావరిలోకి భారీగా వరదనీరు చేరుతోంది. ఈ క్రమంలోనే వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో అప్రమత్తమయ్యారు అధికారులు.. ధవళేశ్వరం సర్ అర్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం పది అడుగులకు చేరింది. గత మూడు రోజులుగా 9.5 అడుగుల వద్ద నిలకడగా ఉన్న నీటిమట్టం గురువారం ఉదయం నాటికి పెరిగింది. ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇన్‌ఫ్లో 1.53 లక్షల క్యూసెక్కులు రాగా అవుట్‌ఫ్లో 1.43లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. పంటకాలువల ద్వారా 8,700 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బ్యారెజ్ దిగువ లంక గ్రామాల్లో అప్రమత్తం..
గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో అధికారులు లంక గ్రామాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పది అడుగులుకు మించి పెరిగే అవకాశాలున్నందున సముద్రంలోకి 2లక్షల క్యూసెక్కులకు పైబడి వరద నీరు వదలాలని చూస్తున్నారు. అందుకని లంక గ్రామాల్లోకి వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయా మండల అధికారులు, గ్రామస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. అదేవిధంగా రెవెన్యూ, పోలీసు, ఫైర్, వైద్యఆరోగ్యశాఖ, మత్స్యశాఖ, హార్టీకల్చర్, అగ్రికల్చర్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా, అంబేడ్కర్‌కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా కలెక్టర్లు వరదలు సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ముంపు ముప్పు...
అఖండ గోదావరి నుంచి వరద ఉద్ధృతి బాగా పెరుగుతుండడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటికే పది అడుగుల నీటి మట్టం స్థాయికి చేరుకున్న వరదనీరు రెండురోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు గురువారం సాయంత్రం నాటికి 1,43,829 లక్షల క్యూసెక్కుల వరద నీరు వదలడంతో గౌతమి, వశిష్ట, వైనతేయ, వృద్ధగౌతమి నదీపాయాల్లో వరద ఉరకలెత్తి క్రిందకు పారుతోంది. ఈ నదీపాయలు మొత్తం అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉండడంతో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్‌కుమార్ ఇప్పటికే అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, అమలాపురం, మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ముంపు సమస్య ఉండడంతో లంక గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.
కరకట్టల పటిష్టతపై ఆందోళన...
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నదీపాయల కరకట్టలకు సంబందించి పటిష్టతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. గత ఏడాది వరదల సమయంలో పలు చోట్ల ఏటిగట్లు బలహీనంగా మారడంతో అక్కడ యుద్ధప్రాతిపదికన ఇసుక బస్తాలుతో బలపరిచి ఊపిరి పీల్చుకున్నారు. గత ఏడాది మూడుసార్లు వరదలు విరుచుకుపడడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వశిష్ట నదీపాయను ఆనుకుని రాజోలు ప్రాంతంలో ఉన్న ఎడమ కరకట ్ట చాలా బలహీనంగా ఉన్నట్లు గత ఏడాదే అధికారులు గుర్తించారు. అయితే అప్పట్లో ఇసుక బస్తాల ద్వారా గట్టును బలపరిచినా అది చాలా అదువుగా ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే పలు ప్రాంతాల్లో నదీపాయలను ఆనుకుని తవ్విన అక్రమ ఆక్వాచెరువుల వల్ల ఏటిగట్లు బాలా బలహీనంగా మారాయని, ఈ ఏడాది కూడా జిల్లాకు వరదల తాకిడి ఎక్కువ ఉండే అవకాశాలున్నందున ఎక్కడైతే కరకట్టలు బలహీనంగా ఉన్నాయో ఆప్రాంతాన్ని గుర్తించి పటిష్టపరచాలని లేకుంటే 2004లో శానపల్లిలంక వద్ద గండి పడి ఎంతటి నష్టాన్ని చవిచూశామో అటువంటి పరిస్థితులు పుపరావృతం అయ్యే అవకాశాలున్నాయని లంక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.