Kakinada Medical College: కాకినాడలోని మెడికల్ కాలేజీలో విద్యార్థినులకు లైంగిక వేధింపులు
Rangaraya Medical College | కాకినాడలోని రంగనాయ మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై కొందరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. కాలేజీ ఇంటర్నల్ కమిటీ విచారణ చేపట్టింది.

కాకినాడ: కాకినాడలోని మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. రంగనాయ మెడికల్ కాలేజీలో బిఎస్సి, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు చేస్తున్న డిప్లొమా విద్యార్థినుల పట్ల ల్యాబ్ అటెండెంట్, మరో ఉద్యోగి కలిసి గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ కు బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది.
జూలై 8న కొందరు విద్యార్థులు ఫ్యాకల్టీ వద్ద లైంగిక, మానసిక వేధింపులపై ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో విషయం ప్రిన్సిపల్ దృష్టికి వెళ్ళింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కాలేజీ యాజమాన్యం కాలేజీ ఇంటర్నల్ కమిటీ ద్వారా విచారణ చేపట్టింది. తమతో ల్యాబ్ అటెండెంట్, మరో ఉద్యోగి అస్సభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, తమను ఫోటోలు చూసి వాటిని పంపి వేధిస్తున్నారని 50 మంది విద్యార్థులు ఆ కమిటీ ముందు చెప్పారు. మైక్రో బయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాలకు చెందిన కొందరు సిబ్బంది తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు వాపోయారు. తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సిబ్బంది పేర్లను కమిటీకి చెప్పినట్లు విద్యార్థులు తెలిపారు. కాలేజీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్ట ప్రకారం పోలీసులు సైతం చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు కోరారు.






















