(Source: ECI/ABP News/ABP Majha)
Bio Ethanol Plant: రాజమండ్రిలో బయో ఇథనాల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయబోతున్న సీఎం జగన్!
Bio Ethanol Plant: రాజమండ్రి సమీపంలో 270 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న బయో ఇథాల్ ప్లాంట్ కు ఏపీ సీఎం జగన్ రేపు శంకుస్థాపన చేయబోతున్నారు. దీన్ని అస్సాగో ఇండస్ట్రీస్ కంపెనీ నిర్మించబోతోంది.
Bio Ethanol Plant: బయోఫ్యూయల్ ఉత్పత్తి కంపెనీ అస్సాగో ఇండస్ట్రీస్.. ఏపీలో ఇథనాల్ ఉత్పత్తి కర్మాగారాన్నినిర్మించబోతోంది. రాజమండ్రి సమీపంలోని గుమ్మాళ్లదొడ్డిలో ఉన్న ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్క్ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, గ్రెయిన్ – ఆధారిత జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ గా నిలువనుంది. ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యం రోజుకు 200 కిలో లీటర్లు (కెఎల్‌పీడీ). ఈ ప్రాజెక్ట్‌ను 270 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి చేయనున్నారు. ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఈ ప్రాజెక్ట్ ఉపాధిని కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ, జిల్లా అధికారులు ఈ ప్రాజెక్ట్‌కు మద్దతు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఈ ప్రాజెక్టు కు రేపు శంకుస్థాపన చేయబోతున్నారు.
అత్యాధునిక యంత్ర సామాగ్రితో.. 20 ఎకరాల విస్తీర్ణంలో
20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ నిర్మించబోతున్నట్లు అస్సాగో ఇండస్ట్రీస్ తెలిపింది. దీనిలో అత్యాధునిక యంత్రసామాగ్రి ఉంటుందని వివరించింది. అస్సాగో ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లో స్థానికంగా సేకరించిన నూకలు, గింజల వ్యర్ధాల నుంచి బయో ఇథనాల్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయమైన ఆయిల్ దిగుమతులు తగ్గించడానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. హరిత ఇంధనాలతో స్వీయ సమృద్ధి సాధించడం దీని లక్ష్యం. హరిత ఇంధనాలలో ఒకటిగా ఇథనాల్‌ను భావిస్తుంటారు. పెట్రోల్‌కు ప్రత్యామ్నాయ ఇంధనంగా దీనిని వినియోగిస్తుంటారు. ఇది కేవలం టైల్‌పైప్ ఉద్గారాల కాలుష్య స్ధాయిని తగ్గించడంతో పాటుగా సౌకర్యం సైతం అందిస్తుంది. పలు దేశాలు ఇప్పుడు ఇథనాల్‌ను వాహనాలలో వినియోగించడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. పలు ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ వాహనాలను ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లతో తయారు చేస్తున్నాయి. బయో ఇథనాల్ అందించే ఆర్థిక విలువతోపాటుగా ఇది పర్యావరణానికి తక్కువ ప్రమాదం కలిగిస్తుంది. ఈ కారణాల చేతనే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు తమ ఇంధన సరఫరా విధానాలను సమీక్షిస్తున్నాయి. శిలాజ ఇంధనాలకు అసలైన ప్రత్యామ్నాయంగా, పునరుత్పాదక శక్తిగా బయోఇథనాల్ కు భారతదేశంలో అభివృద్ధి చేసేందుకు అపార అవకాశాలున్నాయి.
ఈ ప్రాజెక్ట్ గురించి అస్సాగో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ అశీష్ గుర్నానీ మాట్లాడుతూ.. ‘‘అత్యంత ప్రాధాన్యతా ఇంధన ప్రత్యామ్నాయంగా ఇథనాల్ నిరూపితమైంది. మా పెట్టుబడుల ద్వారా హరిత పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌ను నిలుపడంలో మాదైనా పాత్రను పోషించనుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. భవిష్యత్‌లో ప్రత్యామ్నాయ ఇంధన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలువనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా వందల మంది రైతులు, పరోక్షంగా స్థానిక సమాజానికి మిగులు, అవశేషాలు, పాడైపోయిన ఆహారధాన్యాలు ఫీడ్‌స్టాక్‌గా ఉపయోగించడం వల్ల ప్రయోజనం పొందుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ వెన్నుముకగా వ్యవసాయం నిలుస్తుంది. రైతు సమాజానికి ఇది మద్దతు అందిస్తుంది. దానితో పాటుగా సాగు తరువాత మిగిలిన టన్నుల కొద్దీ అవశేషాలు సైతం సద్వినియోగం చేయనున్నారు. ఈ అవశేషాలు ఇప్పుడు వాహనాలకు ఇంధనంగా ఇథనాల్ రూపంలో వినియోగించడం వల్ల రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది."
"నేడు, మౌలిక సదుపాయాలు, సాంకేతికంగా అత్యాధునిక ఆవిష్కరణలు కూడా జోరందుకుంటున్నాయి. ఈ సాంకేతికతలను ఆధారపడ తగిన ఇంధన వనరుగా బయో ఇథనాల్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు వినియోగించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు బయో ఇథనాల్‌ను ఇంధనంగా వినియోగించేందుకు ఉన్న అవకాశాల అన్వేషణ వేగవంతం చేసింది. ఓ అంచనా ప్రకారం ఒక కోటి లీటర్ల ఇథనాల్ మిళిత పెట్రోల్‌తో 20వేల టన్ను కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల విడుదలను అడ్డుకోవచ్చు. గత ఏడు సంవత్సరాల కాలంలో కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను 192 లక్షల టన్నులు తగ్గించడంతోపాటుగా మొత్తం మీద 26 వేల 509 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం పొదుపును భారతదేశంలో ఇథనాల్ వినియోగం ద్వారా చేరుకోగలిగాము. ఈ నూతన ప్లాంట్‌లో 2024 నుంచి ఉత్పత్తిని ప్రారంభించనున్నాము’’ అని అశీష్ గుర్నానీ అన్నారు.
వరి, వేరు శనగ, చెరకు, జొన్నలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా పండించే పంటలు. ఈ పంటలన్నింటిలోనూ వరి అవశేషాలు బయో ఇథనాల్ ఉత్పత్తిలో అత్యున్నత పాత్ర పోషిస్తాయి. 2021లో కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సేకరించిన దాదాపు 3 లక్షల టన్నుల బియ్యాన్ని ఇథనాల్ ఉత్పత్తి కోసం కేటాయించింది. దేశ వ్యాప్తంగా 20% ఇథనాల్ బ్లెండెడ్ ఇంధనాన్ని వినియోగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా 2025 నాటికి ముడి చమురు దిగుమతి గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం 2020–21 నాటికి ఇథనాల్ సమ్మిళిత ఇంధన వినియోగం 8.04%గా ఉంది.