Chinatalpudi MLA Eliza: చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా అమలాపుం ఎంపీగా వస్తారా..?
అమలాపురం ఎంపీ అభ్యర్ధిగా వెళ్లాలని చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు గత నెల రోజులుగా వైసీపీ నాయకత్వం సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముందు నుంచి దీనిని ఎలీజా తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది..
ఏలూరు జిల్లాలో ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానం అయిన చింతలపూడి ఎమ్మెల్యుగా ఉన్న ఉన్నమట్ల ఎలీజా ను తప్పించి అక్కడ కంభం డేవిడ్‌రాజుకు ఇంచార్జ్ బాద్యతలు అప్పగించారు. దీంతో ఎలీజాను అమలాపురం పార్లమెంటు అభ్యర్ధిగా పంపిస్తారన్న చర్చ బాగా జరుగుతోంది. తాజాగా వైసీపీ నాయకత్వం విడుదల చేసిన మూడో జాబితాలో చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జ్ ను మార్చడంతో ఈ చర్చకు బలం చేకూరుతోంది.
చింతలపూడి ఇంచార్జ్‌గా ఉన్న ఎమ్మెల్యే ఎలీజాను మార్చవద్దంటూ నియోజకవర్గంతోపాటు ఉభయగోదావరి జిల్లాల ఇంచార్జ్ ఎంపీ మిథున్ రెడ్డి ఇంటి వద్ద ఆ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు ఇటీవలే నిరసన కూడా తెలిపారు. అయినా అది ఏమాత్రం పట్టించుకోని అధిష్టానం మార్పు అనివార్యం అని తేల్చేసింది. తాజాగా ప్రకటించిన మూడో జాబితాలో అయిదు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ నాయకత్వం ఎలీజాను వెళ్లమన్న అమలాపురం పార్లమెంటు స్థానానికి మాత్రం వెల్లడించలేదు. దీనిని బట్టి ఎలీజాకు వైసీపీ అధిష్టానం ఇచ్చిన అమలాపురం పార్లమెంటు స్థానం ఆఫర్‌ను ఆయనైనా తిరస్కరించవచ్చు.. లేదా అధిష్టానమే పునరాలోచనలో పడి ఇది కూడా పక్కన పెట్టిందా అన్నది తేలాల్సి ఉంది..
అమలాపురం వెళ్లడం ఏమాత్రం ఇష్టంలేని ఎలీజా..
అమలాపురం ఎంపీ అభ్యర్ధిగా వెళ్లాలని ఎలీజాకు గత నెల రోజులుగా వైసీపీ నాయకత్వం సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముందునుంచి దీనిని ఎమ్మెల్యే ఎలీజా తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. స్వయంగా ఆయనే ముఖ్యమంత్రిని కలిసి తాను చింతలపూడిలో పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తానని, అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిసింది. అయినా అధిష్టానం అవేమీ పట్టించుకోకుండా మార్పు అనివార్యం చేసింది. ఈ క్రమంలో ఒక వేళ అధిష్టానం ఎలీజాను అమలాపురం పార్లమెంటుకు వెళ్లాలని ఆదేశించినా వెళ్లే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ఆయన తన అనుచరుల వద్ద తేల్చిచెప్పినట్లు సమాచారం. ఆర్ధిక భారంతోపాటు అమలాపురం అల్లర్ల నేపథ్యంలో కొంచెం తేడాగా ఉందని, పైగా కొత్త ప్రాంతం అవ్వడం వల్ల గెలవలేమనే ఉద్దేశ్యంతో వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే చింతలపూడిలో ఎమ్మెల్యేగా అయిదేళ్ల పాటు మమేకమైన ఎలీజా అక్కడ అయితేనే పక్కాగా గెలుస్తానన్న ధీమాతో ఉన్నారట.. అయితే తానే గెలిచే అవకాశాలున్నా కావాలనే కొందరు పెత్తందార్లు అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించి సర్వే రిపోర్టు బాగానే వచ్చినా దాన్ని మార్చి పంపారని ఇప్పటికే ఎలీజా ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది.
ఇతర పార్టీల నుంచి ఆఫర్లు...
ఎస్సీ రిజర్వుడు స్థానంగా ఉన్న చింతలపూడి నియోజకవర్గంకు ఐఆర్‌ఎస్ అధికారిగా పనిచేస్తూ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు ఉన్నమట్ల ఎలీజా.. వచ్చిందే తడవుగా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా అవకాశం దక్కడంతో ఆయన ఎన్నికల ఫలితాల్లో 25 వేల ఓట్లకు పైబడి ఆధిక్యం సాధించి విజయం సాధించారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎలీజాకు బాగానే పట్టు ఉండడంతో జనసేన నుంచి ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అమలాపురం పార్లమెంటు అభ్యర్ధిగా వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేని ఎమ్మెల్యే ఎలీజా పక్కపార్టీ వైపు చూస్తారా లేక అధిష్టానం నిర్ణయం మేరకు సర్దుకుపోతారా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.