Chandrababu Arrest: నేడు జైల్లో చంద్రబాబును కలవనున్న ఫ్యామిలీ మెంబర్స్- మొదటి రోజు ఎలా గడిచిందంటే?
Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని నేడు ఫ్యామిలీ మెంబర్స్ కలవనున్నారు.
![Chandrababu Arrest: నేడు జైల్లో చంద్రబాబును కలవనున్న ఫ్యామిలీ మెంబర్స్- మొదటి రోజు ఎలా గడిచిందంటే? Chandrababu Arrest First Day TDP Chief Chandrababu spent in Rajahmundry Jail Chandrababu Arrest: నేడు జైల్లో చంద్రబాబును కలవనున్న ఫ్యామిలీ మెంబర్స్- మొదటి రోజు ఎలా గడిచిందంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/12/cfa3676de224a843f5fa2e63547db0fe1694490139394519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chandrababu Arrest: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి భద్రత నడుమ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తొలి రోజు గడిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై జైల్లో ఉన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా, స్పెషల్ రూములో ఉంటున్నారు. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించారు. తెల్లవారుజామున 5 గంటలకే నిద్ర లేచారు. పొద్దున్నే యోగా చేశారు. అనంతరం కాసేపు పత్రికలు చదివారు. కోర్టు ఆదేశాలతో జైలు అధికారులు చంద్రబాబుకు స్నేహ బ్యారక్ లో ప్రత్యేక గదిని ఆదివారం రాత్రే కేటాయించారు. ఆ రూములో వెస్ట్రన్ టాయిలెట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు సహాయకుడిగా ఒక వ్యక్తిని కూడా అందుబాటులో ఉంచారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా బాబు జిల్లాలు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కాన్వాయ్ లో ఉండే ప్రత్యేక ప్యాంట్రీ కార్ ను జైలుకు సమీపంలో ఉంచి, అందులో ప్రత్యేకంగా తయారు చేసిన అల్పాహారాన్ని, భోజనాన్ని చంద్రబాబుకు అందిస్తున్నారు. నారా లోకేశ్ రాజమహేంద్రవరంలోనే ఓ టీడీపీ నేత ఇంటి వద్ద ఉంటూ చంద్రబాబుకు అవసరమైనవి సమకూరుస్తున్నారు.
ఉదయం కాలకృత్యాలు తీసుకున్న తర్వాత కాన్వాయ్ లోని ప్యాంట్రీ కార్ నుంచి ఆయనకు అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్, వేడి నీళ్లు, బ్లాక్ కాఫీ వచ్చాయి. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. మధ్యాహ్నం వేళ 100 గ్రాముల బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్ కూర, పెరుగు వచ్చాయి. అనంతరం మరోసారి వైద్య పరీక్షలు చేశారు. పగలు 3 గంటల సమయంలో టీ తాగేందుకు వేడి నీళ్లు అందించారు. ఆయన ఉంటున్న స్నేహ బ్యారక్ కు ముందే జైలుకు సంబంధించిన ఆస్పత్రి ఉండటంతో అక్కడ వైద్య పరీక్షలు చేపట్టారు. రాత్రి కూడా ప్యాంట్రీ కార్ నుంచే పుల్కాలు, పెరుగు తెప్పించి ఆహారాన్ని అందించారు.
జైలు అధికారులు బాబు భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు ఉన్న జైలు గది వద్ద 24 గంటల పాటు విధులు నిర్వహించేలా 1 + 4 భద్రతను వినియోగించారు. జైలు లోపల, చుట్టుపక్కల పూర్తి స్థాయిలో పటిష్ఠ బందోబస్తు కల్పించారు. అలాగే జైలులో ఉన్న సీసీటీవీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు మొదటి రోజు ఎవరూ రాలేదు. జైలు నిబంధనల ప్రకారం వారానికి 2 ములాఖత్ లను అనుమతిస్తారు. సోమవారం ములాఖత్ కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని జైలు అధికారులు తెలిపారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, కుమారుడు నారా లోకేశ్ మంగళవారం చంద్రబాబును కలిసేందుకు జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
చంద్రబాబు కేసులో బెయిల్‌పై ఈరోజే తీర్పు
చంద్రబాబు హౌస్ అరెస్టు పిటిషన్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మళ్లీ ఇరువర్గాల న్యాయవాదులను కోర్టుకు రావాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో తీర్పు నేడు (సెప్టెంబరు 12) వెలువడనుంది. చంద్రబాబు ఆరోగ్య రీత్యా ఆయన్ను జైల్లో ఉంచకుండా, గృహ నిర్భంధంలో ఉంచాలని చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ వేశారు. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సిద్ధార్థ లుథ్రా ఉదయం వాదనలు వినిపించారు. తీర్పును నిన్న సాయంత్రానికి రిజర్వు చేశారు. కానీ చివరి నిమిషంలో తీర్పును నేటికి వాయిదా వేశారు. నేడు మూడు విడతల వాదనల అనంతరం హౌస్ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని ప్రకటించనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)