Pawan Kalyan Birthday: పండుగలా పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు, పిఠాపురంలో మరింత ప్రత్యేకం
AP Deputy CM Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు మాత్రం ఈసారి ప్రత్యేకం అంటున్నారు ఆయన అభిమానులు, జనసైనికులు.. సేవా కార్యక్రమాలతో అభిమానాన్ని చాటుకుంటున్నారు.
Happy Birthday Pawan Kalyan | గతేడాది వరకు పవర్ స్టార్‌గా, జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఆయన అభిమానులు ఈ సారి మాత్రం తమ అభిమాన నాయకుని పుట్టిన రోజు వేడుకలు డిప్యూటీ సీఎం, మంత్రి, జనసేన అధినేత, పవర్‌స్టార్ ఇలా నాలుగు విధాలుగా చెప్పుకుంటూ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు పవన్ కల్యాణ్ అభిమానులు.. ఈ సారిమాత్రం ఈ వేడుకలు ప్రత్యేకం అంటూ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా సెప్పెంబర్ 2 ముస్తాబవుతుండగా పిఠాపురంలో మాత్రం పవన్ పుట్టిన రోజు వేడుకలు మా ఎమ్మెల్యేగారి తాలూకా అంటూ అక్కడి ప్రజలు పండుగలా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు...
ఎక్కడికక్కడే సేవా కార్యక్రమాలు...
పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయన అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎక్కడిక్కడే సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవర్గాల్లో ఈ వేడుకలు మరింత ప్రత్యేకంగా జరుగుతున్నాయి. కాకినాడ పార్లమెంటు నియోకవర్గ పరిధిలో పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. కాకినాడలో మెగా రక్తదాన శిబిరం, మెగా వైద్య శిబిరంలు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో షాదీఖానాలో మెగా వైద్య శిబిరం, మరో ప్రాంతంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇలా తూర్పుగోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలతోపాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ వేడుకలు మరింత ఘనంగా నిర్వహించేందుకు సన్నధ్ధమవుతున్నారు.
పిఠాపురంలో మరింత ప్రత్యేకం..
పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు మరింత ప్రత్యేకం కానున్నాయి.. ఇప్పటికే శ్రావణ శుక్రవారం సందర్భంగా నియోజకవర్గంలో 12 వేల మందికి చీరలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు దంపతులు హాజరయ్యారు. సెప్టెంబర్ 2న జరగబోయే పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకకు ఎవరు హాజరు కానున్నారో వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే పిఠాపురంలో ఇప్పటికే పవన్ కల్యాణ్ భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి... పాదగయలో పవన్ కల్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు...
పవన్ కల్యాణ్ పిఠాపురం వస్తారా..?
సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ అమరావతిలోనే అందుబాటులో ఉంటున్నట్లు సమాచారం.. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి జనసేన తరపున ఎవరైన ముఖ్య నేత కానీ, పవన్ కల్యాణ్ కుటుంబం నుంచి నాగబాబు కానీ హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.. ఏది ఏమైనా ఈ సారి జరగబోయే పవన్ కల్యాణ్ బర్త్‌డే మాత్రం మాకు మరింత ప్రత్యేకం అంటూ పిఠాపురం నియోజకవర్గం ప్రజలు చెబుతున్నారు..