Bharat Margani: ఆదిరెడ్డి వాసుపై రూ.10 కోట్లు పరువు నష్టం దావా: రాజమండ్రి ఎంపీ భరత్
AP Elections 2024:
Rajahmundry MP Bharat Margani fires on Adireddy srinivas: రాజమండ్రి: ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు)పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ తెలిపారు. నోటికి వచ్చినట్లు మాట్లాడి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేస్తున్న వాసుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు.
ఆదిరెడ్డి వాసుపై అందుకే పరువు నష్టం దావా
నగరంలోని కోట గుమ్మం వైఎస్సార్ విగ్రహం వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి అభివృద్ధి పనుల్లో 25 శాతం కమీషన్లు తీసుకుంటున్నానని టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు మీడియా వద్ద పదే పదే ఆరోపణలు చేశారన్నారు. కాబట్టి పరువు నష్టం దావా వేస్తున్నట్టు వెల్లడించారు. నగరంలో ప్రధాన సెంటర్లలో కొంతమందికి టీడీపీ కండువాలు కప్పించి కరపత్రాలు పంపిణీ చేయిస్తున్నారు. లక్షల కరపత్రాలు ఎక్కడ పడితే అక్కడ జల్లడం.. ఈ చర్యలన్నీ ఎంపీగా ఉన్న తన పరువు, ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఆదిరెడ్డి వాసుయే పనిగట్టుకుని చేయించినట్లు తెలుస్తోందన్నారు. తనపై 25 శాతం కమీషన్లు అభియోగం మొట్టమొదట మోపింది ఆదిరెడ్డి వాసుయే అన్నారు. అందుకే అతనిపై ఐపీసీ 500 ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని, పరువు నష్టం దావా కూడా వేసినట్లు తెలిపారు.
ఇన్ని రోజులు లైట్ తీసుకున్నాను..
అభివృద్ధి పనుల్లో భరత్ 25 శాతం కమీషన్లు తీసుకున్నాడని ఆరోపించినప్పుడు ఒక ప్రతిపక్ష నేత చేసే వ్యాఖ్యలుగా మాత్రమే తీసుకున్నానని చెప్పారు. కానీ పలుమార్లు మీడియా వద్ద వాసు, టీడీపీకి నాయకులు ఆరోపించడం, తమ పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేలా ఉందన్నారు. తనపై సైతం ఆధారాలు లేకుండా వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తుండటంతో వాసుపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. తనపై ఎవరు అనుచిత ఆరోపణలు చేసినా వారిపై కూడా న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తానని ఎంపీ భరత్ హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీగా మేము చేసిన అభివృద్ధి పనుల్లో లోపాలుంటే విమర్శలు చేయవచ్చు.. కానీ 25 శాతం కమీషన్ తీసుకున్నట్టు, కమీషన్ల కోసమే అభివృద్ధి పనులు చేస్తున్నట్టు ఏ ఆధారం ఉందని మాట్లాడతావని వాసును ఉద్దేశించి ఎంపీ భరత్ ప్రశ్నించారు.
నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా - ఎంపీ భరత్ ఛాలెంజ్
తాను ఎవరి వద్దనైనా ఒక్క శాతం కమీషన్ తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటా అన్నారు. దాంతోపాటు ఊరు విడిచి వెళ్ళిపోతా, మళ్లీ కనిపించనని పదేపదే మీడియా సాక్షిగా ప్రకటించినా ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) నుంచి స్పందన లేదన్నారు. ప్రజలలో తనపై ఉన్న అభిమానం, గౌరవం సన్నగిల్లేలా చేయడానికి ఈ కమీషన్ల ఆరోపణలు ఆదిరెడ్డి వాసు చేస్తున్నాడన్నారు. వచ్చే ఎన్నికలలో ఓటమి తప్పదనే భయంతో వాసు ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడన్నారు. తనపై ఎటువంటి ఆరోపణలు చేసినా బహిరంగ చర్చకు సిద్ధమే అన్నారు.
తనను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇలాంటి చీకటి ప్రచారానికి వాసు తెర తీశాడని ఎంపీ భరత్ ఆరోపించారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేయలేక జనసేన, బీజేపీ.. ఇలా అందర్నీ కూడగట్టుకుని ఎన్నికల బరిలోకి వస్తూ కూడా.. సింగిల్ భరత్ ను ఎదుర్కొనే సత్తా ఆదిరెడ్డి వాసుకు లేకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అభివృద్ధి విషయంలో చర్చకు వస్తే తేల్చుకుందాం.. కానీ పసలేని, నిరాధార ఆరోపణలు చేయడం మానుకోకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఎంపీ భరత్ హెచ్చరించారు.