Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
రెండు రోజుల రిమాండ్ పొడిగింపు కూడా ముగియనుండడంతో నేడు సాయంత్రం సీఐడీ అధికారులు చంద్రబాబును ఏసీబీ కోర్టు ఎదుట వర్చువల్‌గా హాజరు పర్చనున్నారు.
ఏపీ సీఐడీ అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును రెండో రోజు విచారణ చేయడం ప్రారంభించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి సీఐడీ అధికారులు ప్రశ్నలు వేస్తున్నారు. చంద్రబాబు తరపు లాయర్లు కూడా విచారణ జరిగే చోటనే ఉన్నారు. తొలుత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి, రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన్స్ హాలులో విచారణ మొదలుపెట్టారు.
ఇవాల్టితో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు ఇచ్చిన రెండు రోజుల కస్టడీ ముగియనుంది. రెండు రోజుల రిమాండ్ పొడిగింపు కూడా ముగియనుండడంతో నేడు సాయంత్రం సీఐడీ అధికారులు చంద్రబాబును ఏసీబీ కోర్టు ఎదుట వర్చువల్‌గా హాజరు పర్చనున్నారు.
నిన్న సీఐడీ 50 ప్రశ్నలు
సీఐడీ అధికారులు నిన్న (సెప్టెంబరు 23) రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా ఎలా నిర్ణయించారు?, సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో జీవో ఎలా ఇచ్చారు?, అగ్రిమెంట్ ఏ విధంగా జరిగింది?, జీవోకి విరుద్ధంగా ఒప్పందం ఎలా చేశారు? 13 చోట్ల నోట్ ఫైళ్లపై సంతకం చేసి అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు?, డిజైన్ టెక్ కంపెనీకి చేరిన నిధులను తరలించడం మీకు తెలుసా? లాంటి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు చెప్పిన సమాధానాలు రికార్డు చేసి ధర్మాసనానికి సమర్పించాల్పి ఉంది.