Amaravati Farmers: నిడదవోలులో ఉద్రిక్తత! అమరావతి రైతులు గో బ్యాక్ అంటూ నినాదాలు, బ్యానర్లు
అమరావతి రైతులు నిడదవోలు గుండా మహా పాదయాత్ర చేస్తుండగా, వారిని కొందరు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అమరావతి రైతులు నిడదవోలు గుండా మహా పాదయాత్ర చేస్తుండగా, వారిని కొందరు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. వీరు వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు కాగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిడదవోలు పట్టణంలోని గణేశ్ సెంటర్‌కు రైతుల మహా పాదయాత్ర రాగానే వైఎస్ఆర్ సీపీ స్థానిక నేతలు నల్ల బెలూన్లు, మూడు రాజధానులకు అనుకూలంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. వాళ్లను గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ఈ రైతుల పాదయాత్రకు అన్ని పార్టీలు మద్దతుగా నిలబడ్డాయి. ఓ వైపు వైఎస్ఆర్ సీపీ శ్రేణులు, మరోవైపు అమరావతి రైతులకు మద్దతుగా వచ్చిన వారి పోటాపోటీ నినాదాలతో నిడదవోలులో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఓ వైపు వర్షం పడుతున్నా.. వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆటంకం కలిగిస్తున్నా.. అమరావతి రైతులు వర్షంలోనూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు.
వైఎస్ఆర్ సీపీ నేతలకు వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తాము ఏమీ తక్కువకాదంటూ అమరావతి మహిళా రైతులు కూడా తొడగొట్టారు. మాజీ మంత్రి జవహార్ మీసం తిప్పుతూ కనిపించారు. రైతుల పాదయాత్రలో టీడీపీ నేతలు పీతల సుజాత, కొల్లు రవీంద్ర, గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
రైల్వే బ్రిడ్జి మూసేయడంపై గోరంట్ల ఫైర్
అమరావతి రైతులు పాదయాత్రను అడ్డుకునేందుకు రాత్రికి రాత్రి రాజమండ్రి బ్రిడ్జ్ మూసివేశారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. శుక్రవారం (అక్టోబరు 14) గోరంట్లతో అమరావతి జేఏసీ నాయకులు భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాలు కచ్చితంగా హైకోర్టు ధిక్కరణే అని అన్నారు. రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడా రోడ్లకు రిపేర్లు చేయడం లేదని, రాత్రికి రాత్రే రోడ్డు, రైలు వంతెన మరమ్మతులు ప్రారంభిస్తారా? అంటూ ప్రశ్నించారు. వారం రోజుల్లో బ్రిడ్జ్ రిపేర్లు పూర్తి అయిపోతాయా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ యాత్రకు కూడా ఇలాగే అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఈనెల 17న పెద్ద ఎత్తున ప్రజలు రాజమండ్రికి తరలివచ్చి అమరావతి రైతులకు మద్దతు ఇవ్వాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు.
రైల్వే రోడ్డు బ్రిడ్జి మూసివేత
రాజమండ్రి- కొవ్వూరు మధ్య ఉన్న రోడ్ కం రైల్వే బ్రిడ్జ్‌ను తాత్కాలింగా మూసివేశారు. మరమ్మతులు కారణంగా రహదారిపై రాకపోకలు నిలిపేశారు అధికారులు. దీనిపై అమరావతి రైతులు సీరియస్ అవుతున్నారు. పాదయాత్రను సజావుగా సాగనియ్యకుండా ప్రభుత్వం మరో కుట్ర చేస్తోందని మండిపడుతున్నారు.
గోదావరి నదిపై రాజమండ్రి కొవ్వూరు మధ్య ఉన్న రోడ్ కం రైల్వే బ్రిడ్జి వారం రోజల పాటు మూసివేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. కొన్ని మరమ్మతులను ఆర్ అండ్‌బి, రైల్వేశాఖ చేపట్టనున్నాయని వివరించారు. దెబ్బతిన్న రోడ్డు మార్గం, రెయిలింగ్, ఫుట్‌పాత్ పూర్తిగా మరమ్మతు చేయాల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.
కీలకమైన బ్రిడ్జి మూసివేయడం వల్ల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు అధికారులు. వాహనాలను నాల్గో బ్రిడ్జి మీదుగా మళ్లించనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పుడు అక్కడ నుంచి ఎలాంటి వాహనాలను అధికారులు వెళ్లనీయడం లేదు. కనీసం అత్యవసర సర్వీసు 108ను కూడా అనుమతించడం లేదు.
పనులు ప్రారంభం కాకుండానే అధికారులు హడావుడి చేయడంపై స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా మూసివేస్తే ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు. మరికొందరు వేరే వాదన వినిపిస్తున్నారు. అమరావతి రైతుల యాత్ర శనివారం ఈ బ్రిడ్జి మీదుగానే వెళ్లాల్సి ఉందని అందుకే ముందస్తుగా మూసివేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాదయాత్రను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చర్యలు తీసుకున్నారని లోకల్ టాక్. రేపు ఉదయం నాటికి కొవ్వూరు వంతెన వద్దకు చేరుకోనున్న అమరావతి రైతుల పాదయాత్ర.