Amalapuram: స్కూల్ హెడ్‌మాస్టర్ గలీజు పనులు! వారికి ఒళ్లు మండడంతో కటకటాల వెనక్కి
Konaseema District: లైంగిక వేధింపుల ఆరోపణలతో అడ్డంగా దొరికిపోయిన కీచక ఉపాధ్యాయుడు దుర్గాప్రసాద్ ను జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు.
దేవాలయం లాంటి బడిలో ఓ కీచక ఉపాధ్యాయుడు తన వంకర బుద్ది ప్రదర్శించి చివరకు జైలు పాలయ్యాడు. తండ్రిలా పిల్లల్ని చూడాల్సిన వయస్సులో తన కామ చేష్టలతో శరీరభాగాలను తాకుతూ సభ్య సమాజం అసహ్యించుకునేలా ప్రవర్తించాడు.. చాలా కాలంగా భరిస్తూ వచ్చిన విద్యార్థులు చివరకు ధైర్యం చేసి తల్లితండ్రులకు చెప్పడంతో వారు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలతో విచారణ చేపట్టిన పోలీసులు కీచక ఉపాధ్యాయుడిపై ఫోక్సో యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయగా 14 రోజుల రిమాండ్ ను కోర్టు విధించింది.
ఈ సంఘటనకు సంబందించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. అమలాపురం గ్రామీణ మండలం బండారులంక హైస్కూల్లో ఎన్వీఎస్ఎస్ దుర్గాప్రసాద్ హెడ్‌మాస్టార్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా కొందరు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. ఎక్కడబడితే అక్కడ చేతులు వేయడం, పిల్లల పట్ల అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం, వారిపట్ల అనుచితంగా ప్రవర్తించడం వంటి చేష్టలతో విద్యార్థినులు విసుగెత్తిపోయారని వారి తల్లితండ్రులు అధికారులకు తెలిపారు. దీనిపై అమలాపురం డీఎస్పీ వై.మాధవ రెడ్డి విచారణ చేసి నిందితుడు దుర్గాప్రసాద్ పై ఫోక్సో యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
కీచకుడికి 14 రోజుల రిమాండ్
కీచక ఉపాధ్యాయుడు దుర్గాప్రసాద్ పై విచారణ చేసిన పోలీసు, ఐసీడీఎస్ అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. కావాలనే విద్యార్థులతో ఎక్కువ సమయం గడపడం.. వారిని దగ్గరగా పిలిపించుకుని వారిపై తాకకూడని చోట్ల చేతులు వేయడం, తుంటరి మాటలతో అసభ్యంగా మాట్లాడడం వంటి వికృత చేష్టలు చేస్తున్నాడని విద్యార్థులు అధికారుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు కీచక ఉపాధ్యాయుడు దుర్గా ప్రసాద్ పై ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
సస్సెండ్ చేసిన విద్యాశాఖ అధికారులు
లైంగిక వేధింపుల ఆరోపణలతో అడ్డంగా దొరికిపోయిన కీచక ఉపాధ్యాయుడు దుర్గాప్రసాద్ ను జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. విద్యార్థులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంతో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులతోపాటు జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా విచారణ చేసి బాధిత విద్యార్థులు, తల్లితండ్రుల నుంచి వివరాలు సేకరించారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు కూతుర్ల వయస్సు ఉండే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.