Actor Suman: పొలిటికల్ ఎంట్రీపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు, ఆ పార్టీకే మద్దతు అని స్పష్టత
తాను జీవితంలో ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధపడినట్లుగా వచ్చిన ప్రచారాన్ని సుమన్ కొట్టిపారేశారు.
రాజకీయాల్లోకి వచ్చే అంశంపై నటుడు సుమన్ తల్వార్ స్పందించారు. భవిష్యత్తులో తాను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. బుధవారం ఆయన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కోమటితిప్ప గ్రామంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడు సత్తినేని శ్రీనివాస తాతాజీ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. వర్షాలు, విపత్తులు ఏటా ఉంటూనే ఉంటాయని, ప్రభుత్వాలు దాన్ని గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.
అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. రైతులు అడిగేది కొద్దిగే అని ఏ ప్రభుత్వమైనా వారి సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. తెలంగాణలో తాను బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు.
ఇటీవల చంద్రబాబుపై తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ చేసిన వ్యాఖ్యలను కూడా సుమన్ సమర్థించారు. రజినీకాంత్ చేసిన ప్రసంగంలో తప్పేమీ లేదన్నారు. ఇటీవలే ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రజినీకాంత్ తన ప్రసంగంలో ఏ పార్టీని, నాయకుడిని విమర్శించలేదని చెప్పారు. అలాంటప్పుడు వైఎస్ఆర్ సీపీ నేతలు రజినీ కాంత్ పై ఎందుకు విమర్శలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌కు పునాదులు వేసిన మాట నిజమేనని, ప్రధాన రూపశిల్పి ఆయనే అని సుమన్ అన్నారు. శంషాబాద్ విమానాశ్రయం, ఐటీ రంగం వల్ల ఇప్పుడు వేలాది మంది ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. అవన్నీ చంద్రబాబు ప్రణాళికే వల్లే అని అన్నారు. రాజకీయాల్లో ఒడుదొడుకులు, కొన్ని తప్పులు, ఒప్పులు సర్వ సాధారణమని చంద్రబాబు మంచి ముఖ్యమంత్రిగా పని చేశారని సుమన్ అన్నారు.
ఆత్మహత్య ప్రచారాన్ని ఖండించిన సుమన్
తాను జీవితంలో ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధపడినట్లుగా వచ్చిన ప్రచారాన్ని సుమన్ కొట్టిపారేశారు. అందులో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టత ఇచ్చారు. తాను ఎప్పుడూ అలాంటి ఆలోచన చేయలేదని, కింద పడినప్పుడు ఎలా పైకి లేవాలనేది మార్షల్ ఆర్ట్స్ లో ఒక భాగంగా ఉంటుందని, అది శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగాను బలాన్ని ఇస్తుందని అన్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం తనకు జీవితంలో ఎంతో సహకరించిందని అన్నారు.