Rajahmundry Ysrcp : రాజమండ్రి వైసీపీలో అంతర్గత కుమ్ములాట, మరోసారి తెరపైకి జక్కంపూడి వర్సెస్ భరత్!
Rajahmundry Ysrcp : రాజమండ్రిలో వైసీపీ అంతర్గత కుమ్ములాటలు వెలుగుచూశాయి. గోదావరి కాలుష్యం విషయంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అనుచరులు ఘర్షణకు దిగారు.
Rajahmundry Ysrcp : రాజమండ్రిలో గోదావరి కాలుష్యంపై కొన్ని రోజులుగా గోదావరి పరిరక్షణ దీక్ష చేపట్టిన వైసీపీ నేత పీకే విశ్వేశ్వరరెడ్డి తాజాగా స్థానిక కోటిలింగాల ఘాట్ వద్ద చేపట్టిన నిరసన దీక్షలో వైపీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగారు. రాజమండ్రి పేపర్ మిల్లు వ్యర్థాలను గోదావరిలోకి వదలడం వల్ల గోదావరి నదీ జలాలు కాలుష్యం బారిన పడుతోందని విశ్వేశ్వరరెడ్డి గోదావరి పరిరక్షణ కింద నిరసన దీక్షలు చేపట్టారు. అయితే ఈక్రమంలో కోటిలింగాల వద్ద జరుగుతున్న నిరసన దీక్షపై మరో వర్గం దాడికి దిగింది. కోటిలంగాల పేట వార్డు ఇన్ ఛార్జ్ పుష్పరాజ్ వర్గం వాదన మరో విధంగా ఉంది. గోదావరి పరిరక్షణ కింద దీక్షలు చేయడం వరకు బాగానే ఉంది కానీ తన వార్డులో ఇష్టారాజ్యంగా దీక్షలు చేస్తే ఊరుకునేది లేదని పుష్పరాజు మండిపడ్డారు. మా ప్రాంతంలో ఇబ్బందులను, సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మాకు తెలుసని, పీకే విశ్వేశ్వరరెడ్డి చర్యల వల్ల ప్రభుత్వానికి, పార్టీకు చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. మీరు రౌడీ బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అంటే మీరే రౌడీ, బ్లేడ్ బ్యాచ్ అంటూ ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అయితే ఈ రెండు వర్గాల్లో ఒకరు ఎంపీ భరత్ వర్గం కాగా మరొకరు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వర్గం కావడం గమనార్హం.
అసలు వివాదం ఏంటి?
గోదావరి పరిరక్షణ కోసం పది రోజులుగా స్థానిక వైసీపీ నాయకుడు పీకే విశ్వేశ్వర రెడ్డి నిరసన దీక్ష చేస్తున్నారు. గోదావరి కాలుష్యంతో పాటు, స్థానిక పేపర్ మిల్లు నుంచి వెలువడే వ్యర్థాలు రాజమండ్రిలో కలపకుండా ధవళేశ్వరం ఆనకట్ట తరువాత గోదావరిలోకి వదలాలని ప్రధాన డిమాండ్‌తో ఈ దీక్షలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్షను గోదావరి కోటిలింగాల ఘాట్ వద్దకు మార్చారు. అక్కడ పలు ప్రజాసంఘాలు, ఇతర నాయకులతో కలిసి దీక్షలు చేస్తుండగా ఇక్కడ దీక్షలు చేయాల్సిన అవసరం లేదని మరో వర్గం వారిపై దాడికి దిగింది. గోదావరిని పరిరక్షించే అంకిత భావం ఉంటే తమ ప్రాంతంలోకి వచ్చి చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ కార్యాలయాల వద్ద చేసుకోవాలని ఒక వర్గం వాదిస్తుంటే పేపర్ మిల్లు యాజమాన్యం దగ్గర మామూళ్లు తీసుకుని మాపై దాడికి దిగారని మరో వర్గం ఆరోపించింది. ఇరు వర్గాలు రాజమండ్రిలో వైసీపీకి చెందిన వారేకాగా ఈ వివాదంపై వైసీపీ అధిష్టానం కూడా సీరియస్ అయినట్లు సమాచారం.
జక్కంపూడి వర్సెస్ భరత్
రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఏర్పడిన విభేదాల కారణం ఒకరిపై ఒకరు ఇటీవల అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గతంలో పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. వారి అనుచరులు కూడా ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఎంపీ మర్గాని భరత్ పురుషోత్తమ పట్నం ప్రాజెక్ట్‌కు భూములిచ్చిన రైతుల డబ్బులను అన్యాయంగా కాజేయాలని ప్రయత్నించారని మరో వర్గం ఆరోపించారు. వారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పొగిడి ఎంపీ మార్గాని భరత్‌పై ఆరోపణలు చేయడంతో పార్టీలోని గొడవల కారణంగానే ఈ స్కాంను బయట పెడుతున్నారన్న అభిప్రాయాలు వినిపించాయి. వీరి వివాదం సీఎం జగన్ వరకూ వెళ్లింది. ఇద్దరి నేతలతో మాట్లాడిన సీఎం జగన్.. సర్దుకుపోవాలని చెప్పారు. అయితే వీరిద్దరి మధ్య వివాదం కొనసాగుతున్నట్లు తాజా ఘటనతో మరోసారి రుజువైంది. జక్కంపూడి రాజా, ఎంపీ భరత్ కలిసిపోయారని అంటున్నా వారి అనుచర వర్గం మాత్రం తరచూ ఘర్షణ పడుతున్నట్లు తెలుస్తోంది.