![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Godavari Floods : ఎగువ నుంచి భారీ వరద, ధవళేశ్వరం వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక
Godavari Floods : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.
![Godavari Floods : ఎగువ నుంచి భారీ వరద, ధవళేశ్వరం వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక Rajahmundry heavy rains Godavari floods first warning at Dhavaleswaram project DNN Godavari Floods : ఎగువ నుంచి భారీ వరద, ధవళేశ్వరం వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/13/fe77f55e85eb32ebeba617f6fcc847cb1663073757912235_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Godavari Floods : ఎగువ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరికి వెల్లువలా వచ్చి చేరుతున్న వరదనీటితో ఇప్పటికే లంక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. గోదావరికి గడచిన నాలుగు నెలల వ్యవధిలో వరదలు రావడం ఇది మూడోసారి. భద్రచలం వద్ద క్రమక్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతోండగా మంగళవారం సాయంత్రం నాటికి 51.60 అడుగుల స్థాయికి చేరింది వరదనీరు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేయగా ధవళేశ్వరం వద్ద కూడా అంతే స్థాయిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి పెరుగుతోన్న క్రమంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు అధికారులు. ఇదిలా ఉంటే ధవళేశ్వరం వద్ద 12.50 అడుగుల స్థాయికి వరద నీరు చేరింది.
ముంపు ముప్పులోకి విలీన మండలాలు
ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి క్రమక్రమంగా పెరుగుతుండడంతో దిగువ ప్రాంతాలకు వరద ఉద్ధృతి అంతే స్థాయిలో పెరుగుతోంది. అయితే ఇప్పటికే నదీ పరివాహక లంక గ్రామాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. ధవళేశ్వరం వద్ద మరింత వరద పెరిగితే లంక గ్రామాలు ముంపు ముప్పులోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. విలీన మండలాల్లోని పలు గ్రామాల్లో వరద పోటెత్తుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. చింతూరు, దేవీపట్నం, కూనవరం, మోతుగూడెం తదితర పాంతాల్లో ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కోనసీమలోనూ వరద
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పి.గన్నవరం, ముమ్మిడివరం, రాజోలు, కొత్తపేట, ఐ.పోలవరం, అయినవిల్లి, మామిడికుదురు మండలాల పరిధిలో పలు లంక గ్రామాల్లో వరద నీరు క్రమ క్రమంగా చేరుతోంది. పశ్చిమగోదావరి జిల్లా రామరాజులంక, పి.గన్నవరం మండల పరిధిలోకి వచ్చే కనకాయ లంకకు వెళ్లే మార్గంలోని కాజ్వే గోదావరి ప్రవాహానికి ముంపునకు గురయ్యింది. అయినవిల్లి మండలంలోకి ఎదురుబిడిం కాజ్ వే పైకి వరదనీరు చేరింది. అధికారులు అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
భద్రాచలం వద్ద పెరుగుతున్న వరద
తెలంగాణతోపాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతోంది. మంగళ వారం ఉదయం 8 గంటలకు 50.2 అడుగులు ఉన్న వరద మధ్యాహ్నం 12 గంటలకు 50.9 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉండగా... 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వరద ఉద్ధృతితో భద్రాచలం గోదావరి స్నాన ఘట్టాలు చాలా వరకు మునిగిపోయాయి. భక్తులు తల నీలాలు సమర్పించే కల్యాణ కట్ట కింద వైపు నీరు చేరింది. గోదావరి కరకట్టపై వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. అలాగే లోతట్టు ప్రాంతాలకు వరద ముంపు పొంచి ఉన్నందున స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు. అధికారులు అంతా క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. గజ ఈతగాళ్లు, బోట్లు లాంచీలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎలాంటి ప్రమాదం వాటిళ్లినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రక్షణ చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే భద్రాచలం, దుమ్మగూడెం మండలాల పరిధిలో పలు చోట్ల వరద నీరు చేరింది. నదిలో ఇంకో రెండు అడుగుల మేర నీటిమట్టం పెరిగితే తీర ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
Also Read : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం- 50.9 అడుగులకు చేరుకున్న నీటిమట్టం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)