Weather Updates: ఏపీకి రెయిన్ అలర్ట్.. మరో రెండు రోజులు వర్షాలు.. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోనూ చినుకులు
Rain Alert To AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Weather Updates: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం, మరో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశాలున్నాయని అంచనా వేశారు. తమిళనాడు, శ్రీలంక తీరప్రాంతానికి సమీపంలో అల్పపీడనం కొనసాగుతుంది. బంగాళాఖాతంలో నవంబర్ 6న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. అల్పపీడనం 3-4 రోజుల్లో పశ్చిమ దిశగా ప్రయాణించి బలహీనపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నుంచి ఉత్తరాంధ్ర తీరం వరకు పెను గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికి తోడు అల్పపీడనం వద్ద 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తమిళనాడు తీరానికి దగ్గరగా శ్రీలంక ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రాగల 3-4 రోజులలో పశ్చిమ దిశలో ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగి శనివారం బలహీనపడింది.
Daily weather report for Andhra Pradesh dated 31.10.2021 pic.twitter.com/RFN0QNmKJV
— MC Amaravati (@AmaravatiMc) October 31, 2021
ఏపీలో ఓ మోస్తరు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది. దాని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రాలో సోమవారం, మంగళవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండి, ఉక్కపోత అధికంగా ఉండనుందని అధికారులు వివరించారు.