UNGA India: పురందేశ్వరి నాయకత్వంలో ఐరాసకు భారత బృందం - టీమ్‌లో మిథున్‌రెడ్డికీ చోటు - టీడీపీ ఎంపీలకు నిరాశ
Purandeswari: బీజేపీ ఎంపీ పురందేశ్వరికి అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్య సమితికి వెళ్లే భారత్ పార్లమెంట్ సభ్యుల బృందానికి ఆమె నాయకత్వం వహిస్తున్నారు .

Purandeswari lead Indian delegation to the United Nations: న్యూయార్క్‌లో అక్టోబర్ 27 నుంచి జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశానికి భారత పార్లమెంటు సభ్యుల బృందానికి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి నాయకత్వం వహిస్తారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్రపంచ దేశాలు శాంతి, భద్రత, మానవ హక్కులు, అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం వంటి ముఖ్య అంశాలపై చర్చించే కీలక వేదిక. ఈ సమావేశంలో భారత్‌ను సమర్థవంతంగా ప్రతినిధిస్తూ చర్చలకు దోహదపడతానని పురందరేశ్వరి తన X పోస్ట్‌లో పేర్కొన్నారు. "ప్రధానమంత్రి మోదీ నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చారు. దేశం తరఫున గర్వంగా ప్రాతినిధ్యం వహిస్తాను" అని పురందరేశ్వరి అన్నారు.
అనూహ్యంగా పురందేశ్వరి టీమ్‌లో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కూడా చోటు లభించింది. ఆయన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి ఇటీవలె బెయిల్ తెచ్చుకున్నారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని సిట్ హైకోర్టులో పిటిషన్ వేసింది. టీడీపీ నుంచి ఒక్కరు కూడా లేరు. ఏపీ నుంచే బీజేపీ ఎంపీగా ఉన్న పురందేశ్వరి ఈ టీమ్‌కు నాయకత్వం వహిస్తారు. అందుకే మరో ఎంపీని ఎంపిక చేయలేదని తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, బీజేడీ, ఆమ్ ఆద్మీ పార్టీల ఎంపీలకు ఈ బృందంలో చోటు కల్పించారు.
I am deeply thankful to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for trusting me with the opportunity to lead the delegation of Indian Parliamentarians to the 80th Session of the United Nations General Assembly (UNGA) in New York, beginning October 27.
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) October 6, 2025
The UNGA is a vital… pic.twitter.com/ubWSuUbzng
ఈ సమావేశంలో గాజా, ఉక్రెయిన్ యుద్ధాలు, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణ వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. భారత బృందంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఉంటారు. బీజేపీ నాయకురాలైన పురందరేశ్వరి గతంలో కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2024లో రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా గెలిచారు. ఈ బాధ్యతతో భారత విదేశాంగ విధానంలో ఆమె పాత్ర కీలకంగా మారిందని భావిస్తున్నారు.
యూపీఏ హయాంలో పదేళ్ల పాటు పురందేశ్వరి కేంద్ర మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరారు. ఇటీవల ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. కేంద్రంలో ఆమెకు కీలక బాధ్యతలు ఇవ్వలనుకుంటున్న కేంద్రం.. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఇప్పుడు ఆమె ఢిల్లీ రాజకీయాలతో బిజీగా ఉంటున్నారు.




















