(Source: ECI/ABP News/ABP Majha)
Prashant Kishar Meet Chandrababu : చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ - షాక్‌లో వైసీపీ!
Prashant Kishar Meet Chandrababu : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈ పరిణామం వైసీపీ వర్గాల్లోనూ సంచలనం అయింది.
Prashant Kishar in Chandrababu House : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉండవల్లి నివాసంతో చంద్రబాబుతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో లోకేష్, ప్రశాంత్ కిషోర్ వచ్చారు. తర్వాత వారు ఒకే వాహనంలో ఉండవల్లికి వెళ్లారు. ఈ పరిణామం ఒక్క సారిగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రశాంత్ కిషోర్ వైసీపీకి స్ట్రాటజిస్ట్. గత ఎన్నికల్లో ఆయన వ్యూహాలతోనే విజయం సాధించామని సీఎం జగన్ నేరుగానే చెప్పారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నేరుగా పని చేయకపోయినప్పటికీ.., ఐ ప్యాక్ ఇప్పటికీ వైసీపీకి పని చాస్తుంది. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ టీడీపీతో టచ్ లోకి వెళ్లడం వైసీపీ వర్గాలను షాక్‌కు గురి చేస్తోంది.
విజయవంతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్
ప్రశాంత్ కిషోర్ విజయవంతమైన వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన చివరి సారిగా బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీ కోసం పని చేశారు. ఆ తర్వాత ఆయన స్ట్రాటజిస్టుగా పని చేయలేదు. ఆయన సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ మాత్రం వివిధ పార్టీలకు పని చేస్తోంది. ప్రస్తుతం ఐ ప్యాక్ కు చెందిన రిషి రాజ్ .. వైసీపీకి పని చేస్తున్నారు. వైసీపీ కార్యకలాపాలు పూర్తిగా ఐ ప్యాక్ చేతుల మీదుగానే నడుస్తున్నాయన్న అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ప్రశాంత్ కిషోర్ జగన్ మోహన్ రెడ్డి పాలనా తీరుకు వ్యతిరేకంగా కొన్ని కామెంట్లు చేశారు.
ఇటీవల వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పీకే
వివిధ మీడియా చానళ్ల డిబేట్స్ లో పాల్గొన్నప్పుడు..ఏపీలా అప్పులు చేసి పంచుకుంటూ పోతే దేశం దివాలా తీస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డికి పని చేసి గెలిపించినందుకు తనను ఇప్పుడు విమర్శిస్తున్నారని కూడా ఓ సారి చెప్పారు. అలాంటి వ్యతిరేక వ్యాఖ్యల తర్వాత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం సహజంగానే రాజకీయవర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. గత ఏడాది బీఆర్ఎస్ కోసం కొన్నాళ్లు పని చేశారు కానీ.. తర్వాత కేసీఆర్ వద్దనుకున్నారు.
టీడీపీకి పని చేయడానికి ప్రశాంత్ కిషోర్ ఆసక్తి కనబరుస్తున్నారని గతంలో జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీన్ని ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు నేరుగా టీడీపీ హైకమాండ్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం.. సంచలనంగా మారింది. ఇది వైసీపీ క్యాంపును దిగ్భ్రాంతికి గురి చేస్తోందని చెప్పవచ్చు.
టీడీపీకి పని చేస్తారా ? సలహాలిస్తారా ?
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి కూడా ఓ స్ట్రాటజిస్ట్ ఉన్నారు. రాబిన్ శర్మ అనే స్ట్రాటజిస్ట్ నేతృత్వంలోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన కూడా గతంలో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ లో పని చేసిన వారే. తర్వాత సొంత సంస్థ పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీకి కారణం ఏమిటన్నది మాత్రం క్లారిటీ లేదు. టీడీపీ కోసం పని చేస్తారా.. సలహాలిస్తారా అన్నది తేలాల్సి ఉంది.