(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi: ఏపీ వ్యక్తిని మెచ్చుకున్న ప్రధాని మోదీ, మన్ కీ బాత్‌లో ప్రత్యేకంగా ప్రస్తావన
PM Modi: మార్కాపురానికి చెందిన రాం భూపాల్ రెడ్డి పేరును ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.
PM Modi In Mann Ki Baat: ప్రధాని మోదీ ఆదివారం (మే 30) ప్రసంగించిన 89వ ఎడిషన్ మన్ కీ బాత్ లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి పేరు ప్రస్తావించారు. ప్రధాని నోటి వెంట ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన రాం భూపాల్ రెడ్డి పేరు వచ్చేసరికి అందరి దృష్టి ఆయనపై పడింది సుకన్య సమృద్ధి యోజన గురించి మోదీ మాట్లాడుతూ మార్కాపురానికి చెందిన రాం భూపాల్ రెడ్డి అనే రిటైర్డ్ ఉద్యోగిని గుర్తు చేశారు. రాం భూపాల్ రెడ్డి పదవీ విరమణ చెందిన తర్వాత ఆయన తన ఆదాయం మొత్తాన్ని బాలికల విద్య కోసం ఖర్చు పెట్టారని తనకు తెలిసిందని అన్నారు. ఇది చాలా గర్వించదగినదని అన్నారు.
రాం భూపాల్ రెడ్డి ఇప్పటి వరకు వంద మంది బాలికలకు సుకన్య సమృద్ధి పథకం ద్వారా బ్యాంకు అకౌంట్లు తెరిచి వారి పేరుతో ఇప్పటిదాకా రూ.25 లక్షలకుపైగా జమ చేశారని మోదీ గుర్తు చేస్తూ ఆయన్ను ప్రశంసించారు. స్వలాభం కోసం కాకుండా సమాజం కోసం పని చేస్తూ అది కూడా మన సంస్కృతిలో భాగమనే విషయాన్ని రాం భూపాల్ రెడ్డి నిరూపించారని అన్నారు.
రాం భూపాల్‌రెడ్డి గురించి..
రాం భూపాల్‌రెడ్డి గతంలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిగా పని చేశారు. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులను ఆయన తన సొంత అవసరాల కోసం వాడుకోకుండా బాలికల విద్య కోసం ఖర్చు పెట్టారు. ‘సుకన్య సమృద్ధి యోజన’ కింద స్కాలర్‌షిప్‌లు పొందేలా చూశారు. 10 ఏళ్లు నిండిన 88 మంది బాలికలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరిచేందుకు యడవల్లి పోస్టాఫీసులో తన బెనిఫిట్‌ల నుంచి రూ.25.71 లక్షలు జమ చేశారు. వారికి రూ.41 వేల వడ్డీ మొత్తం సమానంగా పంపిణీ అవుతుంటుంది. ఆ మొత్తం బాలికలకు 21 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి 3 నెలలకు ఒకసారి 88 ఖాతాలలో జమ అవుతూ ఉంటుంది.
కర్నూలు జిల్లా ఉపాధ్యాయ సంఘం నాయకుడిగా సుదీర్ఘకాలం పాటు రాం భూపాల్ రెడ్డి పని చేశారు. విద్యకు రామ్ భూపాల్ రెడ్డి చేసిన కృషికి గానూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమంత్రులుగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఈయన అవార్డులను అందుకున్నారు.
ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ నెట్‌వర్క్, ఆల్ ఇండియా రేడియో వెబ్‌సైట్, న్యూస్ ఎయిర్ మొబైల్ యాప్‌లో ప్రసారం అవుతుంది. ఇది సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ AIR వార్తలు, DD వార్తలు, PMO, YouTube ఛానెల్‌ళ్లలోనూ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. తొలుత ఈ కార్యక్రమం హిందీలో ప్రసారమైన వెంటనే ఆల్ ఇండియా రేడియో ఈ కార్యక్రమాన్ని దేశమంతా ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేసింది. ఇతర భాషలో మన్ కీ బాత్ అదే రోజు తిరిగి రాత్రి 8 గంటలకు మళ్లీ ప్రసారం అవుతుంది.