Perni Nani : జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తోంది... బీజేపీపై మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్
కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తిని సీఎం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని పేర్ని నాని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందా..?. అవుననే అంటున్నారు.. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని. మంత్రి వర్గ సమావేశాల వివరాల్ని వెల్లడించడానికి ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన.. అన్నీ చెప్పిన తర్వాత రాజకీయాలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఫ్లోలో అన్నారో.. కావాలని అన్నారో కానీ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. కాషాయ కండువా కప్పుకున్న వారిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలనేది బీజేపీ ఆశ అని వ్యాఖ్యనించారు. అదే సమయంలో టీడీపీ, బీజేపీ రెండూ కుమ్మక్కయ్యే పార్టీలని ఆరోపించారు. పేర్ని నాని వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో విస్తృతంగా చర్చనీయాంశం అవుతున్నాయి. పేర్ని నాని వ్యాఖ్యలు యాధృచ్చికంగా అన్నవి కావని.. తెర వెనకు ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కలిగించేలా ఉన్నాయని ఇతర పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఐదారు నెలల కిందట వైసీపీలో చీలిక రాబోతోందన్న వార్తను ఓ ఇంగ్లీష్ ఛానల్ హైలెట్ చేసింది. ఓ సీనియర్ నేత వైసీపీ హైకమాండ్‌పై అసంతృప్తితో ఉన్నారని.. వారంతా ఏ క్షణమైనా బయటకు రావొచ్చని ప్రకటించింది. అయితే అప్పట్లో వెంటనే ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ఆ వార్తను ఖండించారు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆ టీవీ ఛానల్‌కు బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యం. అయితే రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలతో అత్యంత బలంగా ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టడం అంత తేలిక కాదు. దాదాపుగా అసాధ్యం. అందుకే.. ఎవరూ వైసీపీలో అసంతృప్తి స్వరాలు ఉన్నాయని.. వారు బయటకు వస్తారని అనుకోలేదు. అప్పట్లో ఆ వార్త రేపిన కలకలం సద్దుమణిగిపోయింది.
ఆ తర్వాత వైసీపీలో అంతర్గతంగా మరికొన్ని ఘటనలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ నేత తరచూ ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఆయన పర్యటన అనధికారికం. ప్రైవేటు హోటల్లో దిగి పనులు చేసుకుని వెళ్లిపోతారు. ఇంతకీ ఆయనకు ఢిల్లీలో ఉన్న పనులేమిటని.. చాలా మంది మీడియాప్రతినిధులకూ అంతుబట్టని విషయం. అయితే.. ఆయన సీనియార్టీకి తగ్గ ప్రాధాన్యత లేదని వైసీపీ హైకమాండ్‌పై అసంతృప్తిగా ఉన్నారనేది అందరూ చెప్పేమాట. కానీ బయటపడలేరు.
మరోవైపు సీఎం జగన్ బెయిల్ రద్దు అంశంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతూనే ఉంది. విచారణకు వచ్చినప్పుడల్లా.. ఆ టాపిక్ హైలెట్అవుతూ ఉంటుంది. సీఎం జగన్ ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిస్తే.. సతీమణితో సహా వెళ్లి కలుస్తున్నారు. ఈ అంశంపైనా ఊహాగానాలకు కొదవ ఉండటం లేదు. ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో.. అత్యంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన పేర్నినాని... ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించడం.. మరిన్ని ఊహాగానాలకు కారణమయ్యే అవకాశం ఉంది. అయితే ఇది వ్యూహాత్మకమా..? లేక మరేదైనా కారణం ఉందా అన్నది తర్వాత జరగబోయే పరిణామాలను బట్టి అంచనా వేసుకోవచ్చు.