Pedda Reddy Tadipatri entry: పుల్ సెక్యూరిటీతో తాడిపత్రిలోకి పెద్దారెడ్డి ఎంట్రీ - జేసీ వర్గం సైలెంట్ !
Tadipatri: తాడిపత్రిలోకి పెద్దారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడి.. భద్రతా ఖర్చు పెట్టుకుని తాడిపత్రిలోకి అడుగుపెట్టారు.

Pedda Reddy has entered the Tadipatri: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు తాడిపత్రిలో అడుగు పెట్టారు. కొంత కాలంగా ఆయన తాడిపత్రిలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా.. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం దాడులు చేస్తుందన్న కారణంగా పోలీసులు ఎప్పటికప్పుడు ఆపుతూ వస్తున్నారు. శాంతిభద్రతల సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఓ సారి హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ ఆయన అడుగుపెట్టలేకపోయారు. తర్వాత హైకోర్టు కూడా అనుమతి నిరాకరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. భద్రత ఖర్చు తానే పెట్టుకుంటానని సుప్రీంకోర్టుకు భరోసా ఇచ్చారు. దాంతో మూడు వందల మంది పోలీసుల భద్రతకు ఆయన ఖర్చులు చెల్లించి.. తాడిపత్రిలోకి అడుగుపెట్టారు.
తాడిపత్రి చేరుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్న💥 pic.twitter.com/5FOvWZni9C
— 𝗬𝗦𝗥𝗖𝗣 -𝗧𝗔𝗗𝗜𝗣𝗔𝗧𝗥𝗜 ™ (@YSRCP45) September 6, 2025
తాడిపత్రి రాజకీయ చరిత్రలో YSRCP, తెలుగుదేశం పార్టీ (TDP) మధ్య తీవ్ర ఘర్షణలు సర్వసాధారణంగా మారాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో TDP నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గంతో పెద్దారెడ్డి వర్గం మధ్య హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో శాంతిభద్రతల సమస్యలు రేగే అవకాశం ఉందని భావించిన పోలీసులు, పెద్దారెడ్డి తాడిపత్రి ప్రవేశాన్ని అనేకసార్లు అడ్డుకున్నారు. జేసీ వర్గం నుంచి దాడులు జరిగే ప్రమాదం ఉందన్న కారణంతో పోలీసులు అనుమతి నిరాకరించారు.
పోలీసులు అడ్డుకుంటున్నారని పెద్దారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. మొదట సింగిల్ బెంచ్ అనుమతి ఇచ్చినప్పటికీ, డివిజన్ బెంచ్ ఆ ఉత్తర్వులను నిలిపివేసింది. దీంతో పెద్దారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను నిలిపివేసి, తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, భద్రతా ఏర్పాట్ల ఖర్చులను పెద్దారెడ్డి స్వయంగా భరించాలని కోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పెద్దారెడ్డి కోర్టుకు భరోసా ఇచ్చారు.
సుప్రీం కోర్టు ఆదేశాల అనంతరం, అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ పెద్దారెడ్డికి లేఖ రాసి, తాడిపత్రి ప్రవేశ తేదీని ఖరారు చేయాలని కోరారు. సెప్టెంబర్ 6న పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ముందుగా తిమ్మంపల్లిలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 300 మంది పోలీసుల భద్రత మధ్య పట్టణంలోకి ప్రవేశించారు. ఈ భద్రతా ఏర్పాట్ల ఖర్చులను పెద్దారెడ్డి స్వయంగా భరించారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ నిఘా, బారికేడ్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బృందాలు మోహరించబడ్డాయి. పెద్దారెడ్డి సొంత ఇంటికి చేరుకున్న సమయంలో YSRCP కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. "పంతం నెగ్గించుకున్నారు" అని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
TDP వర్గం నుంచి ప్రతిఘటన రావచ్చని అంచనాలు ఉన్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ..పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చే "అవకాశమే లేదు" అని ముందుగా ప్రకటించినప్పటికీ, సుప్రీం కోర్టు తీర్పు YSRCPకు అనుకూలంగా మారింది. అయితే వీలైనంత త్వరగా తాడిపత్రి నుంచి ఆయనను బయటకు పంపేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.





















