Pawan on Volunteers: వైసీపీ హయాంలోనూ అధికారికంగా వాలంటీర్ల వ్యవస్థ లేదు - పవన్ కల్యణ్ కీలక వ్యాఖ్యలు
Janasena : వైసీపీ హయాంలోనూ వాలంటీర్ల వ్యవస్థ అధికారికంగా లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప ని చేయించారని.. వారిని కొనసాగించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు.

Pawan Kalyan: వాలంటీర్లను ప్రభుత్వంతో సంబంధం లేకుండా గత ప్రభుత్వం ఉపయోగించుకుందని .. వారికి సంబంధించి ఎలాంటి జీవోలు కూడా ప్రభుత్వం వద్ద లేవని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం కురిడి గ్రామంలో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వాలంటీర్ల ప్రస్తావన వచ్చినప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పామని.. కానీ వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్లు ఎలాంటి జీవో లేదన్నారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా పని చేశారన్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు అధికారికంగా దాఖలాలు లేవు. గత ప్రభుత్వం వాలంటీర్లను మభ్యపెట్టిందని విమర్శించారు. వాలంటీర్లకు సంబంధించి ఏ పేపర్ వర్క్ ప్రభుత్వం దగ్గర లేదని.. వారిని కొనసాగించేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు.
వాలంటీర్ల వ్యవస్థ ఇక లేనట్లే !
పవన్ కల్యాణ్ తేల్చేయడంతో ఇక వాలంటీర్ల వ్యవస్థ ఏపీలో లేనట్లేనని అనుకోవచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి యాభై ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించారు. ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర నామమాత్రమైపోయి ప్రతీ ఇంటికి ఈ వాలంటీర్లే వెళ్లేవారు. పెన్షన్లు ఇవ్వడం ప్రధానంగా చేసేవారు. ఇక ప్రభుత్వనికి కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించేవారు. అయితే వీరంతా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వారికి ముప్పుగా మారేలా చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
వాలంటీర్లు అంతా వైసీపీ కార్యకర్తలేనని గతంలో ఆ పార్టీ నేతల ప్రకటనలు
వాలంటీర్లు అంతా వైసీపీ కార్యకర్తలేనని ఆ పార్టీ నేతలు చాలా సార్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో వారిని ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఈసీ నియంత్రించింది. దాంతో చాలా మందిని వైసీపీ నేతలు రాజీనామా చేయించారు. వారితో ప్రచారం చేయించుకున్నారు. అయితే వాలంటీర్లు ఎవరూ వైసీపీకి కోసం పని చేయవద్దని కూటమి నేతలు హెచ్చరించారు. తాము వస్తే పది వేల జీతం చేస్తామన్నారు. అయితే అధికారంలోకి వచ్చేసరికే వాలంటీర్ల వ్యవస్థ లేకుండా పోయింది. అంతకు ముందే వాలంటీర్ల కాల పరిమితి ముగిసిపోయింది. దానికి జగన్ సర్కార్ రెన్యూవల్ చేయలేదు. ఈ కారణంగా వాలంటీర్ల వ్యవస్థ అనేది ఏపీలో జగన్ హయాంలోనే లేకుండా పోయింది.
కూటమి అధికారంలోకి వచ్చే సరికే లేకుండా పోయిన వాలంటీర్ల వ్యవస్థ
టీడీపీ ప్రభుత్వం వచ్చే సరికే వాలంటీర్ల వ్యవస్థ లేకపోవడంతో వారిని కొనసాగించడం అనే ప్రశ్న లేకుండా పోయింది. వారు చేసే పనుల్ని సచివాలయ ఉద్యోగులతో చేయిస్తున్నారు. పెన్షన్లను సచివాలయ ఉద్యోగులే పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్ల కోసం కమ్యూనిస్టు పార్టీలు ఇటీవల నిరసనలు చేపట్టాయి. అయితే అలాంటి వ్యవస్థ లేదని ప్రభుత్వం అసెంబ్లీలోనే తేల్చి చెప్పింది. ఇప్పుడు పవన్ కూడా అదే చెప్పడంతో ఇక ఏపీలో వాలంటీర్ల వ్యవస్థకు అవకాశం లేదని క్లారిటీ వచ్చేసినట్లయింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

