Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్
Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో ఇటీవలే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని కేసుపై మహిళా కమీషన్ ఎందుకు స్పందించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో ఇటీవలే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని కేసుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై సాగుతున్న దురాగతాల గురించి మహిళా కమిషన్ కు స్పందించాల్సిన కనీస బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఏపీలో ఆడబిడ్డల అదృశ్యం గురించి మాట్లాడగానే హాహాకారాలు చేసిన పాలక పక్షం, మహిళా కమిషన్ రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు మౌనం వహిస్తోందని నిలదీశారు. ఈ దురాగతాలపై స్పందించాల్సిన బాధ్యత లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థిని దారుణహత్యకు గురైతే ముఖ్యమంత్రిగానీ, హోమ్ శాఖ మంత్రిగానీ, మహిళా కమిషన్ చీఫ్ ఎందుకు స్పందించటం లేదో కచ్చితంగా చెప్పాలని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అనుమానాస్పద మృతి అంటూ పోలీసు అధికారులు హత్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. ఆ బాలిక తల్లితండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
విజయనగరం జిల్లా లోతుగెడ్డలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కూడా తనను కలచి వేసిందని పవన్ కల్యాణ్ తెలిపారు. మైనర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటే రాష్ట్రంలో ఆడ బిడ్డలకు రక్షణ, శాంతి భద్రతల స్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడ బిడ్డలకు, మహిళలకు రక్షణ కరవైంది అనే మాట వాస్తవం అని వివరించారు. మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించకుండా పోలీసుల చేతులు కూడా పాలక పక్షం కట్టేస్తోందని ఆరోపించారు. దిశ చట్టాలు చేశాం, దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాం అనే పాలకుల ప్రకటనలు ఏ మాత్రం రక్షణ ఇవ్వడం లేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి మహిళల రక్షణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలంటూ చెప్పుకొచ్చారు.
అసలు ఇంటర్ విద్యార్థిని కేసులో ఏం జరిగిందంటే..!
చిత్తూరు జిల్లా వేణుగోపాలపురం గ్రామంలో ఈ విషాదం జరిగింది. పెనుమూరు మండలం కావూరివారిపల్లె పంచాయతీలోని వేణుగోపాలపురం గ్రామానికి చెందిన 16ఏళ్ల బాలిక పెనుమూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 16వ తేదీన ఇంటి నుండి వెళ్లిన విద్యార్థిని మళ్లీ తిరిగి రాలేదు. కూతురు కనిపించక పోవడంతో బంధుమిత్రులతో కలిసి చుట్టుపక్క ప్రాంతాల్లో గాలించాడు ఆమె తండ్రి. కుమార్తె కనిపించడం లేదని పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో వేణుగోపాలపురంలో వినాయక నిమర్జనం జరుగుతోంది. గ్రామంలోని గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు కొందరు యువకులు.. ఊరి సమీపంలోని ఓ బావి వద్దకు వెళ్లారు. ఆ బావిలో బాలిక మృతదేహం చూసి కేకలు పెట్టారు. గ్రామనికి చేరుకుని విషయం చెప్పగా... అందరూ బావి దగ్గరకు పరుగుపెట్టారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి బావిలోని విద్యార్థిని డెడ్ బాడీని బయటకు తీశారు. ఆ మృతదేహం మిస్సింగ్ అయిన బాలికదేనని గుర్తించారు. కుమార్తె చనిపోయిందని తెలిసి... విద్యార్థిని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆమెది ఆత్మహత్య అని తేలింది.
బావిలో నుంచి బాలిక మృతదేహం బయటకు తీసినప్పుడు... తలపై వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి గుండులా కనిపించడంతో అనుమానం మొదలైంది. బాలిక ధరించిన లెగ్గిన్ సైతం లేదు అని, నాలుక కూడా కోసినట్టు ఉండటంతో గ్రామస్తులతో పాటు బాలిక తల్లిదండ్రులు ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని... ఎవరో రేప్ చేసి చంపేశారని ఆరోపించారు. పోలీసులు నిందితులతో చేతులు కలిసి.. తమకు అన్యాయం చేస్తున్నారని గ్రామస్తులతో కలిసి పోలీస్‌స్టేసన్‌ను ముట్టడించిచారు. తమకు న్యాయం చేయాలని... కుమార్తెను చంపిన నిందితులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.