AP News : పిన్నెల్లికి మంత్రి పదవి రాకపోతే మూకుమ్మడి రాజీనామాలు - ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచుల తీర్మానాలు
AP New Cabinet : ఏపీ కొత్త కేబినెట్ పై కసరత్తు జరుగుతున్న వేళ ఆశావహుల ఇళ్ల వద్ద అనుచరుల సందడి చేస్తున్నారు. కొందరు తమ నేతలకు మంత్రి పదవి రావడంలేదని తెలిసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
AP New Cabinet : ఏపీ కొత్త కేబినెట్ పై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆదివారం రాత్రి 7 గంటలకు ఫైనల్ లిస్ట్ ను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపనుంది. 24 మంది పాత మంత్రుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇప్పటికే పలువురికి ఫోన్లు వెళ్తున్నాయి. పాత, కొత్త కలయికతో కేబినెట్ ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. పది మంది పాతవాళ్లు, 15 మంది కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆశావహుల ఇళ్ల మద్ద కార్యకర్తలు భారీగా చెరుతున్నారు. అయితే కొన్ని చోట్లు వైసీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నేతకు మంత్రి పదవి దక్కడంలేదని తెలిసి తదుపరి కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు.
పిన్నెల్లి అనుచరుల్లో అసంతృప్తి
కొత్త కేబినెట్ కసరత్తు దాదాపు పూర్తయి ఒక్కొక్కరికీ ఫోన్లు వస్తుండడంతో ఆశావహుల అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది చోట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంత్రిపదవి రావడంలేదన్న సమాచారంతో ఆయన అనుచరులు సమావేశమయ్యారు. పిన్నెల్లికి మంత్రి పదవి దక్కకపోతే రాజీనామాకు సిద్ధమని మున్సిపల్ కౌన్సిలర్లు తేల్చిచెబుతున్నారు. మాచర్లలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు సమావేశం నిర్వహించి తీర్మానించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీసీటీ, సర్పంచులు కూడా సమావేశం నిర్వహించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కేబినెట్‌లో స్థానం దక్కకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లికి మంత్రి పదవి వస్తుందని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ మంత్రి వర్గ విస్తరణలో పిన్నెల్లికి అవకాశం లేదన్న వార్తలు వస్తుండడంతో ఆందోళనతో రాజీనామాలకు సిద్ధమయ్యారు. మరో వైపు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు ఒక్కొక్కరూ మాచర్ల చేరుకుంటున్నారు.
ఆశావహుల ఇళ్ల వద్ద కార్యకర్తల సందడి
నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసం వద్ద కార్యకర్తలు సందడి చేస్తున్నారు. కాకాణికి మంత్రిపదవి ఖాయమనే ప్రచారంతో ఆయన అనుచరులు పెద్ద ఎత్తు ఇంటికి చేరుకుంటున్నారు. పలువురు నేతలు, కార్యకర్తలు కాకాణికి స్వీట్లు తినిపిస్తూ అభినందనలు తెలుపుతున్నారు. పోలీసులు కూడా వారి లిస్టులో చేరిపోయారు. మంత్రి పదవి రాకముందు శుభాకాంక్షలు చెబుతూ సెల్యూట్ చేస్తున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఇంటి వద్ద సందడి నెలకొంది. ఆయనకు బీసీ సమీకరణాల్లో మంత్రి పదవి దక్కుతుందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎం, కీలక మంత్రి పదువులు నిర్వహించారు. ధర్మాన ప్రసాదరావు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలలో మంత్రిగా ఉన్నారు.