AP TDP chief : కొత్త ఏపీ టీడీపీ చీఫ్‌గా పల్లా శ్రీనివాస్ - త్వరలో అధికారిక ప్రకటన
Andhra Politics : ఆంధ్రప్రదేశ్ టీడీపీ చీఫ్ గా పల్లా శ్రీనివాస్ యాదవ్ ను నియమించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Palla Srinivas as AP TDP chief : తెలుగదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు కొత్త అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్ పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కారణంగా కొత్త అధ్యక్షుడ్ని నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. గాజువాల నుంచి 95వేలకుపైగా ఓట్ల మెజార్టీతో మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనితకు మంత్రి పదవి దక్కింది. సీనియర్లు ఎవరికీ అవకాశం దక్కలేదు. అందుకే పల్లాకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
యువనేతకు చాన్సివ్వాలనుకున్న చంద్రబాబు
అయ్యన్న పాత్రుడితో పాటు మరికొంత మంది పేర్లను కూడా పరిశీలించారు. అయితే యువకుడు అయిన పల్లా అయితేనే పార్టీ యాక్టివ్ గా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయనను ఎంపిక చేశారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా సేర.. పార్టీని పట్టించుకోవడం లేదని.. అందుకనే అదికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోందని అంటున్నారు. ఈసారి అలాంటి సమస్య రాకుండా.. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం పూర్తి స్థాయిలో ఉండేలా .. పల్లాను నియమిస్తున్నారు.
ప్రజా ఉద్యమాలలో ముందున్న పల్లా
పల్లా శ్రీనివాసరావు తండ్రి టీడీపీలో ఉండేవారు. కానీ పల్లా శ్రీనివాసరావు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం టీడీపీలో చేరి 2014లో గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో ఓటమి తరువాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడమే కాకుండా, నియోజకవర్గంపైనా స్పష్టమైన ముద్ర వేశారు. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. విశాఖలో పార్టీని నడిపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం నిర్వహించారు.
వైసీపీ హయాంలో పల్లాకు అనేక వేధింపులు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా పలు వేధింపులు ఎదుర్కొన్నారు. ఆయన ఆస్తులపై దాడులు చేశారు. ఓ భవనాన్ని రాత్రికి రాత్రి కూలగొట్టారు. అయినా పల్లా శ్రీనివాసరవు వెనక్కి తగ్గలేదు. వైసీపీలోకి వస్తే మేయర్ పదవి ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారని చెబుతున్నారు. కానీ పల్లా టీడీపీని వదిలి పెట్టే ప్రశ్నే లేదని తేల్చినట్లుగా తెలుస్తోంది. పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. సామాజిక సమీకరణాల్లో అది సాధ్యం కాలేదు. కృష్ణా జిల్లా నుంచి బీసీకి చాన్సివ్వాలని చంద్రబాబు అనుకున్నారు. అందుకే పార్థసారధికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమితులు కావడం వల్ల .. బీసీ వర్గాల్లో మరింత ఆదరణ టీడీపీకి వస్తుందని భావిస్తున్నారు.