Festival Pandalu : పండగంటే పందేలే - మూడో రోజూ ఎక్కడా తగ్గలే ! రేపట్నుంచి మాత్రం పోలీసుల వేట ?
మూడో రోజూ కోడి పందేల జోరు కనిపిస్తోంది. వందల కోట్లు చేతులు మారి ఉంటాయని అంచనా.
Festival Pandalu : పండగంటే పందేలే అన్నట్లుగా కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేల దగ్గర్నుంచి రకరకాల జూదాలు విస్తృతంగా జరుగున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో యథేచ్ఛగా కోడిపందేలు మూడో రోజు కూడా ఊరూవాడా సాగుతున్నాయి. బరుల వద్ద గుండాట, మూడు ముక్కలాట, పేకాట సైతం విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. పందేలను అడ్డుకుంటామన్న పోలీసులు ఎప్పట్లానే పట్టించుకోలేదు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రతి మండలంలో సరాసరిన పదికిపైగా బరుల్లో కోడిపందేలు కొనసాగుతున్నాయి. కోడి పందేల కోసం ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం .. తరలి వస్తున్నారు.
రూ. కోట్లలో చేతులు మారిన నగదు !
కోడిపందేల్లోనే కాదు గుండాట, మూడు ముక్కలాట, పేకాట వంటి జూదాల్లో కోట్లలో నగదు ప్రవాహం జరుగుతోంది. పెద్దపెద్ద బరుల్లో ఒక్కో పందానికి రూ.ఐదులక్షల నుంచి రూ.పది లక్షలు వరకూ బెట్టింగ్ సాగుతోంది. పందేల్లో ఎక్కువగా స్థానిక అధికార, ప్రతిపక్ష నాయకులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల్లో వంద కోట్లకుపైగా పందేల రూపంలో బెట్టింగ్ సాగినట్లు ఆంచనా వేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోనూ 47 మండలాల్లో 400కుపైగా బరుల్లో కోడిపందేలు సాగుతున్నట్లు అంచనా. తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాలో ఎప్పటిలానే కోడిపందాలు జరిగాయి. కొన్ని చోట్ల ఎంట్రీ పాస్‌పెట్టారు. పాస్ ఉన్ నవారినే లోపలికి అనుమతించారు. రాత్రి కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో పందేలు నిర్వహించారు.
వీఐపీ బరుల్లో రూ. కోట్లలో పందేలు !
ఒకవైపు పోలీసు హెచ్చరికలు.. మరోవైపు అధికారుల ఆంక్షలు అయినా పందెం రాయుళ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. సంక్రాంతి సంబరాలను పందేలతో పూర్తి చేస్తున్నారు. కొన్ని చోట్ల వీఐపీ బరులుఏర్పాటు చేశారు. కోడి పందేలకు వచ్చే వారిని వీఐపీ ఏ గ్రేడ్, వీఐపీ బీ గ్రేడ్, వీఐపీలుగా విభజించారు . వీఐపీ ఏ గ్రేడ్ కు రూ. 60 వేల ఎంట్రీ ఫీజు, వీఐపీ బీ గ్రేడ్ కు రూ. 40 వేల ఎంట్రీ ఫీజు, వీఐపీలకు రూ. 25 వేల ఎంట్రీ ఫీజు పెట్టారట. కోడి పందేల బరులకు ఒక్కో బరికి రూ. 5 లక్షల నుంచి లక్ష లోపు వరకు వేర్వేరు బరుల సిద్ధం చేసి ఆడిస్తున్నారు. ఇవన్నీ హై సెక్యూరిటీజోన్ మధ్య నిర్వహిస్తున్నారు. ఇతరులు లోపలికి వెళ్లడానికి అవకాశం ఉండదు. ఇలాంటి బరుల్లో లావాదేవీలన్నీ కోట్లలోనే జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.
ఎమ్మెల్యేల ఆశీస్సులున్న చోట్ల పట్టించుకోని పోలీసులు !
డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి, బాపట్ల, కృష్ణా, ఎస్‌టిఆర్ జిల్లాల్లో ఎమ్మెల్యేల ప్రమేయంతో ఏర్పాటయిన కోడి పందేల బరుల ను పోలీసులు పట్టించుకోలేదు. అయితే సంక్రాంతి మూడు రోజులు ప్రజలు కూడా కోడిపందేలను సెంటిమెంట్ గా భావిస్తారు కాబట్టి .. పోలీసులు కూడా ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేయలేదు. కానీ మంగళవారం నుంచి మాత్రం ఒక్క బరి కూడా ఉండకూడదని పోలీసులు తేల్చిచెబుతున్నట్లుగా తెలుస్తోంది. కోడి పందేలు నేరమని.. ఎట్టి పరిస్థితుల్లోనూ పండగ తర్వతా కొనసాగిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. దీంతో సోమవారంతోనే అత్యధిక బరులు ఆగిపోయే అవకాశం ఉంది.