Bhubaneswar ttd temple : భువనేశ్వర్ లో కొలువుదీరిన శ్రీవారు, వైభవంగా ఆలయ మహాసంప్రోక్షణ
Bhubaneswar ttd temple : ఒడిశాలోని భువనేశ్వర్ లో టీటీడీ శ్రీవారి ఆలయాన్ని నిర్మించింది. శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు.
Bhubaneswar ttd temple : ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) శ్రీవారి ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయం మహాసంప్రోక్షణ కార్యక్రమం గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయ శిలాఫలకాన్ని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్(Biswabhusha Harichandan), ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(Naveen Patnaik), విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, టీటీడీ ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి(YV Subba Reddy) ఆవిష్కరించారు.
భువనేశ్వర్ లో శ్రీవారి ఆలయం
భువనేశ్వర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం 8.50 నుంచి 9.05 గంటల మధ్య మిథున లగ్నంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ జరిగింది. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్, టీటీడీ ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. అంతకుముందు ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు పుణ్యాహవచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 8 నుంచి 8.30 గంటల వరకు విమాన గోపుర కలశ ఆవాహన చేశారు.
ఇవాళ్టి కార్యక్రమాలు
ఉదయం 8.50 నుండి 9.05 గంటల మధ్య ఆగమోక్తంగా ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహించారు వేదపండితులు. ఆ తరువాత బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, అర్చక బహుమానం జరిగింది. ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజావరోహణం, సాయంత్రం 6.30 నుంచి 9.30 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహించనున్నారు.
అతిథులకు సన్మానం
ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మా నందేంద్ర సరస్వతి, ఎంపీ అపరాజిత సడంగి, బోర్డు సభ్యులు మల్లాడి కృష్ణారావు, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, స్థానిక సలహా మండలి అధ్యక్షుడు దుష్మంత్ కుమార్, సీఈ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో గుణభూషణ్‌రెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు, తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ అనంతరం ఆలయ ముఖమండపంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శాలువతో సన్మానించి, స్వామివారి చిత్రపటం అందించారు. అనంతరం వేద పండితులు సీఎం, గవర్నర్ లకు వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు.